తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ 

తెలంగాణలో పేదలకు ప్రైవేటువైద్యాన్ని చేరువచేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి ఇకనుంచి ఆయుష్మాన్‌ భారత్‌ తోడు కానున్నది. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌స్కీం, ఆయుష్మాన్‌ భారత్‌-ప్రధానమంత్రి జన ఆరోగ్యయోజన పథకాలు కలిసి ఆయుష్మాన్‌ భారత్‌- ఆరోగ్యశ్రీగా మారింది. దీంతో రాష్ట్రప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సలతోపాటు, ఆయుష్మాన్‌ భారత్‌లో ఉన్న చికిత్సలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న ఆయుష్మాన్‌భారత్‌లో చేరాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గతంలోనే నిర్ణయించిన మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం నేషనల్‌ హెల్త్‌ అథారిటీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకొన్నది. దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవోకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఆదేశాలు జారీచేశారు. 

పథకం అమలు విధివిధానాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఖరారుచేసింది. ఆరోగ్యశ్రీలో 972 రకాల చికిత్సలు అందుబాటులో ఉండగా, ఆయుష్మాన్‌ భారత్‌లో 1,393 ఉన్నాయి. ఆయుష్మాన్‌లో లేని 540 ప్రొసీజర్స్‌ ఆరోగ్యశ్రీలో ఉండగా, ఆరోగ్యశ్రీలో లేని 685 ప్రొసీజర్స్‌ ఆయుష్మాన్‌లో ఉన్నాయి. దీంతో ఈ రెండింటిని కలపడంవల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుందని భావిస్తున్నారు. 

ఉదాహరణకు డెంగ్యూ, మలేరియా వంటివాటికి ఆరోగ్యశ్రీ వర్తించదు. కానీ ఆయుష్మాన్‌ వర్తిస్తుంది. అలాగే కిడ్నీ, లివర్‌ మార్పిడి వంటి చికిత్సలు ఆరోగ్యశ్రీలో ఉండగా.. అవి ఆయుష్మాన్‌లో లేవు. ఈ రెండింటిని కలిపితే అన్ని చికిత్సలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. రాష్ట్ర ప్రజలకు 1,887 రకాల చికిత్సలకు ఉచితంగా వైద్యం అందుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

దేశ జనాభాలో ఆర్థికంగా అట్టడుగున ఉన్న 40% జనాభాకు ఉచిత ఆరోగ్యబీమా సదుపాయాన్ని అందించే ఉద్దేశంతో ‘ఆయుష్మాన్‌ భారత్‌’గా పేరొందిన ‘ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్యయోజన’ (పీఎం-జయ్‌) ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకొచ్చారు. నెలకు రూ. పదివేల కంటే తక్కువ సంపాదన ఉన్నవాళ్లంతా ఈ పథకానికి అర్హులు.

 పథకంలో భాగంగా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల విలువైన వైద్యసేవలను ఉచితంగా అందిస్తారు. ఇందుకోసం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. 1,393 వ్యాధులకు దేశవ్యాప్తంగా సుమారు 20 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఈ పథకం కింద చికిత్సలు చేస్తారు. 

దవాఖానల్లో చేరే మూడు రోజుల కంటే ముందు (ప్రీ-హాస్పిటలైజేషన్‌) నుంచి దవాఖానలో చికిత్స అనంతరం 15 రోజుల వరకు (పోస్ట్‌-హాస్పిటలైజేషన్‌) అయ్యే మందులు, ఇతరత్రా ఖర్చులన్నీ ఈ పథకం పరిధిలోకే వస్తాయి. వ్యాధి నిర్ధారణ, వైద్యుడి రుసుము, గది, సర్జన్‌ రుసుము, ఐసీయు, ల్యాబ్‌ చార్జీలు, భోజనం తదితర ఖర్చులు కూడా దీని పరిధిలోకి వస్తాయి.

కరోనా బాధితులు ఆయుష్మాన్‌ భారత్‌ కింద చికిత్స చేయించుకోవడానికి అర్హులని కేంద్రప్రభుత్వం పేర్కొన్నది. వాస్తవంగా జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటికి ఈ పథకం వర్తించదు. అయితే, కరోనా ప్రధాన లక్షణాలు కూడా ఇవే కావడం వల్ల ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ వర్తింపుపై కొన్ని సూచనలు చేసింది. 

ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన బాధితులకు ఈ కవరేజీ వర్తిస్తుందని వెల్లడించింది. కరోనా నిర్ధారణ అయిన ఆయుష్మాన్‌ భారత్‌ లబ్ధిదారులు కనీసం ఒకరోజు దవాఖానలో చికిత్స తీసుకుంటే ఈ పథకం యాక్టివేట్‌ అవుతుంది.

బండి సంజయ్ హర్షం 

ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని తాము వివిధ మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఒత్తిడి ఫలించిందని ఆయన తెలిపారు.

ఆయుష్మాన్ భారత్‌ పథకంలో చేరాలని ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్‌తో బిజెపి చేపట్టిన ‘‘గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష’’ను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స చేయడంతో పాటు పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.