విజయన్ మంత్రివర్గంలో అల్లుడు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి భార్య!

అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన పక్షం రోజుల తర్వాత కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఎంచుకున్న మంత్రివర్గం సిపిఎం పార్టీలో చిచ్చురేపుతున్నది. పార్టీపై, ప్రభుత్వంపై తన పూర్తి ఆధిపత్యం కోసం సీనియర్లు అందరిని పక్కన పెట్టడం,  పార్టీ నుండి మంత్రివర్గంలో చేరనున్న మొత్తం 11 మందిని కొత్తవారిని తీసుకోవడం పార్టీ కేంద్ర నాయకత్వంకు కూడా మింగుడు పడటం లేదని తెలుస్తున్నది. నిరంకుశ ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. 

ఆరోగ్య మంత్రిగా అంతర్జాతీయంగా కోవిద్ సమయంలో సమర్ధవంతంగా పనిచేస్నిన్నట్లు పేరు తెచ్చుకున్న కె శైలజను మంత్రివర్గం నుండి బైట పెట్టడంతో పాటు, టి పి రామకృష్ణన్, ఎం. ఎం. మని, కడకంపల్లి సురేంద్రన్, ఏసీ మొయిద్దీన్ వంటి మాజీ మంత్రిలను పక్కన పెట్టడం పార్టీ వర్గాలలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. 

పైగా, మొదటిసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన తన అల్లుడు పి ఎ మహమ్మద్ రియాస్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో బంధుప్రీతికి, వారసత్వ రాజకీయాలకు ముఖ్యమంత్రి ఆజ్యం పోస్తున్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. ఉత్తర కేరళలో సిపిఎం `ముస్లిం నేత’ గా ఆవిర్భవిస్తున్న రియాస్ ప్రస్తుతం పార్టీ యువజన విభాగం డివైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 

అదే విధంగా, సిపీఎం రాష్ట్ర కార్యదర్శి, ఎల్డిఎఫ్ కన్వీనర్ ఎ విజయరాఘవన్ భార్య ఆర్ బిందుకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నారు. సిపిఎం లో ఈ విధమైన బంధుప్రీతి గతంలో లేదని పరిశీలకులు భావిస్తున్నారు. 

తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిపై వస్తున్న విమర్శల పట్ల శైలజ స్పందిస్తూ తనకు పార్టీ ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేర్చానని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ వ్యక్తులు ప్రధానం కాదని, వ్యవస్థ ప్రధానం అని చెబుతూ నూతన బృందం మంచిగా పనిచేయగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు. తాను మంత్రివర్గంలో లేకపోయినా మాజీ జర్నలిస్ట్ వీణ జార్జ్ తో పాటు ముగ్గురు మహిళలు చేరబోతున్నట్లు ఆమె గుర్తు చేశారు. 

సిపిఎంలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం విజయన్ కె లభించింది. ఎన్నికల సమయంలోనే రెండుసార్లు ఎమ్యెల్యేగా ఉన్నవారికి సీట్ లేదంటూ పలువురు సీనియర్లను పక్కన పెట్టేసారు. 

శైలజను మంత్రివర్గం నుండి మినహాయించడంతో పాటు మంత్రుల ఎంపికలో రాష్ట్ర నాయకత్వం వ్యవహరించిన తీరుపట్ల సిపిఎం కేంద్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. పైగా ఈ విషయంలో తమను సంప్రదించగా పోవడం పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. 

పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచురి, పొలిట్‌బ్యూరో సభ్యుడు బృందా కారత్ ఈ నిర్ణయంతో నిరాశ చెందిన వారిలో పార్టీ వర్గాలు పేర్కొన్నారు. అయితే, పశ్చిమ బెంగాల్‌లో పార్టీ ఒక్క సీట్ కూడా తెచ్చుకోలేక పోవడం, విజయన్ అపూర్వమైన రీతిలో వామపక్షాలను తిరిగి అధికారంలోకి తీసుకురావడంతో, కేంద్ర నాయకత్వం ఈ సమయంలో ఏమీ మాట్లాడలేని నిస్సహాయస్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నది.

పార్టీ  కేంద్ర కమిటీ తదుపరి సమావేశంలో ఈ సమస్య చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, “సిపిఎం ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా చేరడానికి సంబంధించిన విషయాలు పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించే అంశాలు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆ అంశంపై చర్చించి ఏకగ్రీవంగా దీనిపై నిర్ణయం తీసుకుంది ” అంటూ ఏచూరి ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

శైలజను మంత్రివర్గంలోకి తీసుకొనక పోవడం రాష్ట్ర, జాతీయ స్థాయిలో వామపక్షాలకు కొన్ని సమస్యలు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు సిపిఐ నాయకత్వం కూడా భావిస్తున్నది. అయితే మంత్రివర్గంలో తమ ప్రతినిధులను ఎంచుకొనే హక్కు సిపిఎంకు ఉంటుందని సిపిఎం జాతీయ కార్యదర్శి డి రాజా స్పష్టం చేశారు.

విజయన్‌తో పాటు, మంత్రివర్గంలో అనుభవం ఉన్న పార్టీకి చెందిన ఏకైక మంత్రి దాని కేంద్ర కమిటీ సభ్యుడు, 1996-2001 వరకు స్పీకర్‌గా, 2006-2011 వరకు మంత్రిగా పనిచేసిన దళిత నేత కె. రాధాకృష్ణన్. కేరళలో గత ఎన్నికలలో బిజెపి గెలుపొందిన ఏకైక సీట్ నిమోన్ లో బిజెపికి చెందిన మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్‌ను తీవ్రమైన పోటీలో చాలా తక్కువ ఆధిక్యతతో  ఓడించిన వి శివన్‌కుట్టిని కూడా మంత్రివర్గంలో తీసుకొంటున్నారు.