మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్యకు కరోనా పాజిటివ్‌

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య కరోనాకు పాజిటివ్‌గా పరీక్ష చేశారు. దీంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని ఆరోగ్యశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. అలాగే ఆయన భార్య మీరా భట్టాచార్య సైతం వైరస్‌ బారినపడ్డారు. దీంతో ఆమె మంగళవారం సాయంత్రం నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

బుద్ధదేవ్‌ భట్టాచార్య, ఆయన సతీమణి, వారి సహాయకుడి నుంచి ఉదయం నమూనాలను సేకరించగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నాయి. మీరా భట్టాచార్యకు చికిత్సలు అందించేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేశామని, మాజీ ముఖ్యమంత్రికి ఇంట్లోనే వైద్యులు సేవలందిస్తున్నారని, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నట్లు వివరించాయి.

మరోవంక, ఉత్తరప్రదేశ్ మంత్రి విజయ్ కశ్యప్ క‌రోనాతో క‌న్నుమూశారు. 56 ఏండ్ల క‌శ్య‌ప్ క‌రోనా బారిన‌ప‌డ‌టంతో గుర్గావ్‌లోని వేదాంత ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డ‌టంతో ఆయ‌న మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి తుదిశ్వాస విడిచారు.  మంత్రి మృతిప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా సంతాపం తెలిపారు. మంచి కార్య‌క‌ర్త‌ను పార్టీ కోల్ప‌యింద‌ని చెప్పారు.

మంత్రి ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లోని ఛ‌ర్త‌వాల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. కాగా, సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ మంత్రివర్గంలో ఇప్ప‌టికే ఇద్ద‌రు మంత్రులు క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించారు. క‌శ్య‌ప్ మృతితో ఆ సంఖ్య‌గా మూడుకు చేరింది. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు మృతిచెందారు.