దేశం పేరు చెడగొడుతున్న కాంగ్రెస్ ‘టూల్‌కిట్’

దేశం పేరు చెడగొడుతున్న కాంగ్రెస్ ‘టూల్‌కిట్’

కొవిడ్ పరిస్థితులపై కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేశ ప్రతిష్టను, ప్రధాని మోదీ గౌరవాన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కొవిడ్-19 సంక్షోభంపై ఓ ‘టూల్‌కిట్’ రూపొందించిందని ఆ పార్టీ ఆరోపించింది. 

దేశమంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతోందంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర దుయ్యబట్టారు. కొవిడ్-19 మ్యూటెంట్‌ను ‘‘ఇండియన్ స్ట్రెయిన్’’, ‘‘మోదీ స్ట్రెయిన్’’ అని పిలవాలంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ ‘‘టూల్‌కిట్’’ సూచనలు ఇస్తోందని ఆయన ఆరోపించారు. 

ఇవాళ  జరిగిన ఓ మీడియా సమావేశంలో సంబిత్ పాత్ర  మాట్లాడుతూ.. ‘‘కొవిడ్-19పై ఇవాళ మీడియాలో కాంగ్రెస్ టూల్‌కిట్ ఒకటి పచార్లు కొడుతోంది. దేశం ఆరోగ్య సంక్షోభంలో చిక్కుకున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఈ టూల్‌కిట్ ద్వారా రాజకీయ లబ్ధి కోసం ఎలా ప్రయత్నిస్తోందో దేశం మొత్తం గమనిస్తోంది. భారత ప్రభుత్వ ప్రతిష్టకు, సేవా కార్యక్రమాలు చేస్తున్న వేలాది మంది ప్రజలకు అపకీర్తి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది..’’ అని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ‘టూల్‌కిట్’లో ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ప్రతిష్ట’’ ఎలా దెబ్బతీయాలనే దానిపై ఓ కాలమ్ కూడా ఉందనీ.. దీని కింద ప్రధాని మోదీ ప్రతిష్టను, ప్రజాదరణను నాశనం చేయాలని ఉందని సంబిత్ ఆరోపించారు. కొవిడ్ సంక్షోభాన్ని మోదీ చక్కగా నిర్వహించారని కొంత వరకు ఒప్పుకున్న కాంగ్రెస్ పార్టీ.. తీరా ఇప్పుడు సెకండ్ వేవ్‌ను అవకాశంగా తీసుకుని మోదీ గౌరవాన్ని చెడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుందంటూ ఆయన దుయ్యబట్టారు.

 ‘‘భారత్లో లోని విదేశీ కరెస్పాండెంట్లను ఉపయోగించుకుని అంతర్జాతీయ మీడియాలో మోదీ, ఆయన అసమర్థత అంటూ ప్రత్యేక కథనాలు వండివార్చాలని ఆ టూల్‌కిట్‌లో కాంగ్రెస్ పార్టీ తన శ్రేణులకు సూచించింది. విదేశీ మీడియాలో వచ్చిన కరోనా మరణాలు, అంత్యక్రియల ఫోటోలను స్థానిక మీడియాలో ఉపయోగించాలని, వివిధ జిల్లాలకు చెందిన రిపోర్టకు చేరవేయాలని ఆ పార్టీ సూచిస్తోంది….’’ అని సంబిత్ పాత్ర ఆరోపించారు.