కేరళలో సీఎం తప్ప సిపిఎం మంత్రులంతా కొత్తవారే 

కేరళలో ఎల్‌డీఎఫ్ కూటమి వరుసగా రెండోసారి గెలిచి రికార్డు సృష్టించడమే కాకుండా ఈ కూటమిలోని సీపీఎం మరొక కొత్త ఒరవడికి నాంది పలికింది. పినరయి విజయన్ మినహా మిగిలిన మంత్రులందరినీ పక్కనబెట్టింది. 11 మంది మంత్రులను నియమించుకునేందుకు సీపీఎంకు అవకాశం ఉండగా, పాత మంత్రులందరికీ ఉద్వాసన పలికి, యువతకు పెద్ద పీట వేసింది. 

కేరళ సీపీఎం శాసనసభా పక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ నియమితులయ్యారు. పినరయి విజయన్ మే 20న కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఈ నియామకం జరిపింది. పినరయి విజయన్ తదుపరి ప్రభుత్వంలో మంత్రుల పేర్లను కూడా ప్రకటించింది.  శాసన సభ సభాపతి పదవికి ఎంబీ రాజేశ్‌ను, పార్టీ విప్‌గా కేకే శైలజను ఎంపిక చేసింది. పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా టీపీ రామకృష్ణన్‌ను నియమించింది. ప్రస్తుత మంత్రులంతా ఈసారి మంత్రులయ్యే అవకాశాన్ని కోల్పోయారు.

పినరయి విజయన్ తదుపరి మంత్రివర్గంలో మంత్రి పదవులను చేపట్టబోతున్నవారు… ఎంవీ గోవిందన్, కే రాధాకృష్ణన్, కేఎన్ బాలగోపాల్, పీ రాజీవ్, వీఎన్ వాసవన్, సజి చెరియన్, వీ శివన్ కుట్టి, మహమ్మద్ రియాస్, డాక్టర్ ఆర్ బిందు, వీణా జార్జి, వీ అబ్దుల్ రహమాన్. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, మాజీ పరిశ్రమల మంత్రి ఈపీ జయరాజన్, మాజీ పీడబ్ల్యూడీ మంత్రి జీ సుధాకరన్ వంటి సీనియర్లను ముందుగానే ఎన్నికల బరి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. 

కేర‌ళ‌లో క‌రోనా క‌ట్ట‌డికి అవిశ్రాంతంగా ప‌ని చేసిన ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైల‌జ‌కు కూడా కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. క‌రోనా వైర‌స్‌నే కాదు నిఫా వైర‌స్‌ను కూడా ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొగ‌లిగారు.ఆమెకు మంత్రి ప‌ద‌వి కేటాయించ‌కుండా పార్టీ విప్‌గా నియ‌మిస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించిన ఎమ్మెల్యేగా రికార్డులకెక్కారు.