మాజీ కేంద్ర మంత్రి చమన్‌ లాల్‌ గుప్తా మృతి 

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి చమన్‌ లాల్‌ గుప్తా (87) మంగళవారం కన్నుమూశారు. ఆయన మే 5న కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. నారాయణ ఆసుపత్రిలో విజయవంతంగా కోలుకొని గాంధీనగర్‌లోని ఇంటికి ఆదివారం చేరారు. మంగళవారం ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించి ఉదయం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబీకులు తెలిపారు. 

గుప్తాకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఏప్రిల్‌ 13, 1934న జమ్మూలో జన్మించిన ఆయన  గత రెండేళ్ల కిందట వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రాజకీయాలకు దూరమయ్యారు. చమన్‌ లాల్‌ గుప్తా 1972లో మొదటిసారిగా జేఅండ్‌కే లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి ఎన్నికవగా, ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.

2008, 2014 మధ్య జమ్మూకాశ్మీర్‌ శాసన సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. 1996లో జమ్మూ ఉధంపూర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా పొందారు. 1998, 1999లోనూ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు. చమలాల్‌ గుప్తా 1999లో కొద్ది నెలలు పౌర విమానయాన మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆహార శుద్ధి, పరిశ్రమలు, కేంద్ర రక్షణ సహాయ మంత్రిగానూ సేవలందించారు. 

బీజేపీ జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర అధ్యక్షుడిగానూ రెండుసార్లు పని చేసిన ఆయన  జీఎం సైన్స్‌ కళాశాల జమ్మూ, అలహాబాద్‌ విశ్వవిద్యాలయం (యూపీ) నుంచి ఎంఎస్సీ పూర్తి చేశారు. హిందీలో ఆయన మూడు గ్రంధాలను రచించారు. 

 చమన్‌ గుప్తా మరణంపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సంతాపం ప్రకటించారు. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటని కార్యాలయం ట్వీట్‌ చేసింది. ప్రజా సంక్షేమానికి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుందని పేర్కొన్నారు.