లాక్‌ డౌన్‌ సడలింపు సమయంలో విజృభింస్తున్నకరోనా !

కరోనా కట్టడికి తెలంగాణాలో పది రోజులపాటు లాక్‌ డౌన్‌ విధించినా ప్రయోజనం కనిపించడం లేదు. ఉదయం 6 నుండి 10 గంటల పాటు నిత్యావసర వస్తువుల కోసం సడలిస్తున్న సమయంలో జనం ఎగబడుతూ ఉండడంతో ఆ సమయంలోనే కరోనా విజృభింస్తున్నట్లు ఆందోళన వ్యక్తం అవుతున్నది. 

ఈ సమయంలో అన్ని దుకాణాలు తెరిచే ఉంటు-న్నాయి. దానితో  నాలుగు గంటల్లో కొనుగోలు చేసుకొని వెళ్లాలనే తపన కావొచ్చు.  తొందరగా వెళితే సరిపోతుందనే ఆలోచన ఉండొచ్చు.. కానీ ఆసమయంలో ప్రతిఒక్కరూ రోడ్లపైకి రావడంతో జనసమూహంగా మారుతోంది. కిరాణా దుకాణాలు, వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు-, పాలు, పండ్ల దుకాణాలు తదితర షాపుల వద్ద గుంపులు గుంపులుగా చేరుతున్నారు.

ప్రతి ఒక్కరూ నాలుగు గంటల్లోనే క్రయవిక్రయాలు జరపాలనే ఆలోచనతో ఒకరిపై ఒకరు ఎగబడి కొనుగోళ్లు చేస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ, కోదాడ, హుజుర్‌ నగర్‌, దేవరకొండ, నేరేడుచర్ల, నకిరేకల్‌, యాదగిరిగుట్ట, చౌటు-ప్పల్‌, హాలియా, తిరుమలగిరి తదితర పట్టణ ప్రాంతాల్లోని దుకాణ సముదాయాల వద్ద జనం రద్దీ కనిపిస్తోంది. లాక్‌ డౌన్‌ విధించిన  కూడా జనం గుంపులు తగ్గడం లేదు. 

ఒక వ్యక్తి సాధారణంగా ఒక రోజు నిర్ధయవసర వస్తువులను కొనుగోలు చేసుకొంటే నాలుగైదు రోజులపాటు మళ్ళి రావలసిన అవసరం ఉండదు. అయినా ఇంతగా రద్దీ కనిపిస్తుండడం అంతుచిక్కడం లేదు. పైగా, ఇంటికే నితావసర వస్తువులు సరఫరా చేసే యాప్ లు సరిగ్గా పనిచేయక పోవడం, అన్ని ప్రాంతాలకు చేరాక పోవడంతో దుకాణాల వద్ద రద్దీ పెరుగుతున్నది. 

లాక్‌ డౌన్‌ ను ఎంత కట్టుదిట్టంగా అమలు పరచినా ఈ నాలుగు గంటలు జనం గుంపులు, గుంపులుగా  రోడ్లపైకి వస్తూ ఉండడంతో ప్రయోజనం ఉండడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఇక పెట్రోల్ బంకులు వంటి వాటి వద్ద జనం గుంపులు, గుంపులుగా చెరుతూ ఉండడంతో అత్యవసరమైన వారు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు.