కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి చెప్పారు.
తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న 5,500 రెమిడిసివర్ల ఇంజక్షన్ల సంఖ్యను సోమవారం నుంచి 10,500కి పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి సిఎంకు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో అదనంగా 200 టన్నుల ఆక్సీజన్‌ను తెలంగాణకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ నుంచి, ఒరిస్సాలోని అంగుల్ నుంచి, పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నుంచి తెలంగాణకు ఆక్సీజన్‌ను సరఫరా చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్రమంత్రి తెలిపారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి సిఎం కెసిఆర్‌ను కోరారు.
వ్యాక్సీన్లను కూడా పెద్దమొత్తంలో తెలంగాణకు సరఫరా చేయాలని సిఎం కోరిన నేపథ్యంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సెకండ్ డోస్‌కు ప్రాధాన్యతనివ్వాల్సిందిగా కేంద్రమంత్రి సిఎం కెసిఆర్‌ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ డోస్‌కే ప్రాధాన్యతనిస్తున్నదని సిఎం కెసిఆర్ స్సష్టం చేశారు.
అందరికీ కరోనా వైద్యం అందించాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి తలకుమించిన భారంగా మారే పరిస్థితి వుంటుందని, అందులో భాగంగా, కరోనా నియంత్రణ కోసం ఆక్సీజన్, రెమిడెసివర్, వాక్సిన్లను తెలంగాణకు తక్షణమే సరఫరా చేయాలని, ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఆదేశాలు జారీచేసినట్టుగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సిఎం కెసిఆర్‌కు వివరించారు.
More Stories
అల్లు అర్జున్ కు హైకోర్టులో మధ్యంతర బెయిల్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
అత్యంత శక్తిమంతమైన మహిళగా నిర్మలా సీతారామన్