పోలీసులు  థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న రఘురామరాజు   

సిఐడి అదుపులో ఉన్నప్పుడు తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, తనను భౌతికంగా కొట్టారని అంటూ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణం రాజు కోర్ట్ కు ఫిర్యాదు చేయడంతో రాజకీయంగా కలకలం చెలరేగింది. శనివారం సాయంత్రం సీఐడీ కార్యాలయం నుంచి  ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు  వచ్చిన ఆయన కాళ్లకు గాయాలు కనిపించాయి. 

సీఐడీ కస్టడీలో ఉన్న తనను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టారని,  తన కాళ్లను తాళ్లతో కట్టేసి… అరికాళ్లపై కర్రలు, ఫైబర్‌ లాఠీలతో కొట్టారని తెలిపారు. గాయాలతో కమిలిపోయి ఉన్న పాదాలను జడ్జికి చూపించారు. అంతకుముందు రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు గుంటూరులోని ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.

‘‘శుక్రవారం రాత్రి సీఐడీ కార్యాలయంలో నేను నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా.. ముఖాలకు కర్చీ్‌ఫలు కట్టుకున్న ఐదుగురు వ్యక్తులు వచ్చారు. నా రెండు కాళ్లను తాడుతో కట్టారు. ఒకడు నన్ను కర్రతో కొట్టాడు. మరొక వ్యక్తి… రబ్బరు కర్ర(ఫైబర్‌ లాఠీ)తో నా రెండు అరికాళ్లపై కొట్టాడు” అంటూ తెలిపారు. 
 
” తర్వాత.. నన్ను గదిలో అటూఇటూ నడవమన్నారు. నేను నడిచాను. ఆ తర్వాత మళ్లీ అరికాళ్లపై కొట్టారు. మళ్లీ నడవమన్నారు. ఈసారి నేను నడవలేకపోయాను. అప్పుడు వాళ్లు వెళ్లిపోయారు’’ అని రఘురామ వివరించారు. అరెస్టు తర్వాత తన పట్ల అమానుషంగా వ్యవహరించారంటూ కొందరు అధికారుల పేర్లను కూడా ప్రస్తావించారు. కోర్టులో న్యాయవాదులందరినీ బయటకు పంపి… ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్న అంశాలను మేజిస్ట్రేట్‌ రికార్డు చేసుకున్నారు.
 
 దీనిపై మేజిస్ట్రేట్‌ స్పందిస్తూ.. ‘‘నిందితుడి పాదాలు కమిలిపోయి ఉన్నాయి. వైద్య పరీక్షలు కచ్చితంగా అవసరం. ప్రభుత్వ ఆస్పత్రి, రమేశ్‌ ఆస్పత్రి వైద్యులు, కేంద్రం కల్పించిన వై-కేటగిరీ భద్రత సమక్షంలోనే పరీక్షించాలి. గాయాలు ఎందుకు? ఎప్పుడు అయ్యాయో రికార్డు చేయాలి’’ అని ఆదేశించారు.
 
కాగా, ఎంపీ రఘురామ కేసు విచారణకు స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటు చేశారు. జస్టిస్ ప్రవీణ్ నేతృత్వంలో బెంచ్ ఏర్పాటైంది. స్పెషల్ మోషన్‌ను సీనియర్ న్యాయవాదులు మూవ్ చేశారు.
 
రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. దెబ్బలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హైకోర్టు ఒక మెడికల్ టీం ను ఏర్పాటు చేసి, రఘురామరాజు గాయాలను పరిశీలించి నివేదిక ఇవ్వమని ఆదేశించింది.
 
మరోవంక,   రఘురామకృష్ణం రాజుకు ఈనెల 28 వరకు రోజుల రిమాండ్‌ విధిస్తూ గుంటూరు  సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రాజుకు 14 రోజులు పోలీస్‌ కస్టడీకి అనుమతించిన కోర్టు ఆయన ఆరోగ్యం బాగయ్యే వరకు జైలుకు తరలించొద్దని ఆదేశించింది. 
 
వెంటనే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించాలని.. తొలుత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలన్న కోర్టు ఆదేశించింది. ఎంపీకి వై కేటగిరి భద్రత కొనసాగించాలని సీఐడీ కోర్టు స్పష్టం చేసింది. ఎపి సిఐడి అధికారులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని  కోరుతూ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్ ఆదివారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
 
ఇదిలా ఉండగా, కోర్టుకు వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకున్నారని రఘురామ తరఫు లాయర్లు తెలిపారు. పబ్లిక్ కోర్టులోకి వెళ్లేందుకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని లాయర్ గోపినాథ్ తెలిపారు. కోర్టులోకి న్యాయవాదులను వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు.