ఈ విషమ సమయంలో దేశం ఒక జట్టుగా పనిచేయాలి 

ఈ విషమ సమయంలో దేశం ఒక జట్టుగా పనిచేయాలి 
రోజూ మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం పోరాడుతున్న ప్రస్తుత విషమ సమయంలో దేశంలో అందరూ ఒక జట్టుగా పనిచేయడం ద్వారా మాత్రమే కరోనా మహమ్మారిని వేగవంతంగా కట్టడి చేయగలమని ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. 
ఈ విషమ సమయంలో ఒకరిపై మరొకరు తప్పులు ఎత్తి చూపుతూ కాలం గడపకుండా మనమంతా ఒక జట్టుగా పనిచేయాలని హితవు చెప్పారు. ఐదు రోజులుగా జరుగుతున్న ఉపన్యాసాల ధారావాహిక‘ పాజిటివిటీ అన్‌లిమిటెడ్ ’లో శనివారం  ముగింపు ప్రసంగం చేస్తూ ప్రస్తుత పరిష్టితులలో నాయకులు “అహేతుక ప్రకటనలు” చేయకుండా సంయమనం పాటించాలని హెచ్చరించారు. అందుకు ఇది సమయం కాదని స్పష్టం చేశారు.
 
ఇప్పుడు మూడవ వేవ్ గురించి చర్చలు జరుగుతున్నాయని గుర్తు చేస్తూ  కాని మనం భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అయితే మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని హితవు చెప్పారు. ఇప్పుడు దేశం దృష్టంతా భవిష్యత్తుపైనే ఉండాలని.. అప్పుడే ప్రజలు, ప్రభుత్వం ప్రస్తుత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని సంక్షోభాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారని చెప్పారు. 
 
మనమంతా కలిసికట్టుగా వైర్‌సను ఓడిద్దామని పిలుపునిచ్చారు. మానవ జీవితంలో జనన, మరణాలు సహజమని.. అవేమీ మనల్ని భయపెట్టలేవని, ప్రస్తుత పరిస్థితులు మనకు భవిష్యత్తులో ఎలా ఉండాలో నేర్పుతాయని చెప్పారు.
 
మహమ్మారిని “మానవత్వానికి సవాలు” గా అభివర్ణించిన   భగవత్, భారతదేశం ప్రపంచానికి ఒక ఉదాహరణను చెప్పాలని సూచించారు. “ఇది (కరోనా మహమ్మారి) మానవత్వం ముందు ఒక సవాలు. భారతదేశం ఒక ఉదాహరణ చెప్పాలి. యోగ్యతలు, లోపాలను చర్చించకుండా మనం ఒక జట్టుగా పనిచేయాలి” అని హితవు చెప్పారు.
 

మొదటి వేవ్  తరువాత ప్రభుత్వం, ప్రజలు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని భగవత్ విచారం వ్యక్తం చేశారు.  క‌రోనా మొద‌టి వేవ్ త‌ర్వాత ప్ర‌భుత్వం, ప్ర‌జ‌లు సుర‌క్షిత మార్గాల‌ను వ‌దిలేశార‌ని, దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితికి దారి తీసింద‌ని తెలిపారు.

“మనం ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాము, ఎందుకంటే మనమందరం – సాధారణ ప్రజలు, ప్రభుత్వం, పరిపాలన – మొదటి వేవ్  తరువాత ఉదాసీనత వహిస్తూ వచ్చాము. వైద్యులు హెచ్చరిస్తున్నా మనం  ఉదాసీనతలోనే ఉన్నాం.  అందుకే మనం నేడు ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నాము” అని చెప్పారు.

ప్రజలు ‘పాజిటివ్’ (సానుకూల) ధోరణితో వ్యవహరిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకొంటూ ఉండాలని కోరారు. ముందుగా మన ఆరోగ్యం, భద్రత గురించి జాగ్రత్త వహించాలని చెప్పారు.  ఈ ప్రయత్నంలో మొత్తం కుటుంభం కలసి మాస్క్ ధరించడం, సురక్షితంగా ఉండటం వంటి అన్ని మార్గదర్శక సూత్రాలను పాటిస్తూ ఉండాలని సూచించారు.
 
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లాండ్ పరిస్థితిని ప్రస్తావిస్తూ ప్రతిదీ ఆ దేశానికి వ్యతిరేకంగా వెడుతున్న సమయంలో అప్పటి ఆ దేశ ప్రధాని  విన్స్టన్ చర్చిల్  డెస్క్ మీద ఉన్న ఒక కోట్ ను గుర్తు చేశారు “ఈ కార్యాలయంలో నిరాశావాదం లేదు. ఓటమి అవకాశాలపై మాకు ఆసక్తి లేదు. అవి ఉనికిలో లేవు ”.

అదేవిధంగా, ఈ పరిస్థితిలో “మనం ధైర్యాన్ని వదులుకోలేము. మనమంతా ధృడంగా ప్రస్తుత పరిస్థితులను పరిష్కరించుకోవాలి” అని తెలిపారు. వైఫల్యాలతో సంబంధం లేకుండా లక్ష్యం చేరే వరకు ధైర్యంతో పనిచేస్తూ ఉండడం మన వ్యక్తితం అని భగవత్ గుర్తు చేశారు. 
విజయాలను, పరాజయాలను ఇముడ్చుగల శక్తిని మన సంస్కృతి మనకు ఇచ్చినదని తెలిపారు.
ఈ మహమ్మారి ప్రజలు అందరిని కలచి వేస్తున్నా, తాము ఇబ్బందులు ఎదుర్కొంటూనే చాలామంది ఇతరులకు తగు సహాయం అందిస్తున్నారని భగవత్ కొనియాడారు. ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవకులు ఎక్కడికక్కడ తమకు సాధ్యమైన రీతిలో ఎక్కడికక్కడ అవసరమైన వారికి ఆహార ప్యాకెట్లు, మంచినీళ్లు సరఫరా చేస్తున్నారని తెలిపారు.
సేవ భారతి ఉచితంగా హోమియో క్లినిక్ లను నడుపుతున్నదని చెబుతూ దేశ వ్యాప్తంగా అటువంటి పాజిటివ్ కథనాలను సేకరించి ఇతరులకు స్ఫూర్తి కలిగించాలని సూచించారు. సహాయం అందించడంతో పాటు ప్రజలలో ఆశాభావం కూడా కలిగించాలని పేర్కొన్నారు. “మనం చేసే సేవ ఎటువంటి వివక్ష లేకుండా ఉండాలి. మనం ఉదారంగా చేయడంలేదు, మన బాధ్యతగా చేస్తున్నాము” అని తెలిపారు.  
 
వివిధ సంస్థల సహకారంతో ఆరెస్సె్‌సకు చెందిన ‘కొవిడ్‌ రెస్పాన్స్‌ టీం’ ఈ నెల 11 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ తదితరులు ఆన్‌లైన్‌లో ప్రసంగించారు.