కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ మృతి 

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, రాహుల్ గాంధీ సన్నిహితుడు  రాజీవ్ సాత‌వ్ ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. సాత‌వ్ ఏప్రిల్ 22 న కరోనా వైరస్ బారిన పడ్డారు. 

46 ఏళ్ళ సాతవ్  కరోనా నుండి కోలుకున్నారని, కానీ  ఇంతలో ఆరోగ్యం విషమించిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. సాత‌వ్‌కు సైటోమెగాలోవైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. 

 పూణేలోని జహంగీర్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ సాత‌వ్  వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.  కాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభలో డిప్యూటీ కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ, పార్టీ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, శశి థ‌రూర్, భూపిందర్ సింగ్ హుడా త‌దిత‌రులు ఇటీవలే కరోనా బారిన పడ్డారు. 

రాజీవ్ శాత‌వ్‌ మహారాష్ట్రకు చెందిన రాజ్యసభ సభ్యుడు. 2014 ఎన్నికలలో మహారాష్ట్రలోని హింగోలి నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. కానీ 2019లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపింది. ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి. గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గతంలో భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 

రాజీవ్ స‌తావ్ మృతికి ప్రధాని న‌రేంద్ర‌మోదీ సంతాపం తెలియ‌జేశారు. రాజీవ్ స‌తావ్ రాజ‌కీయాల్లో బాగా ఎదుగుతూ ప్రాణాలు కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ‘నా పార్ల‌మెంట్ మిత్రుడు రాజీవ్ స‌తావ్ మ‌ర‌ణం న‌న్ను క‌ల‌చివేసింది. రాజీవ్ స‌తావ్ స‌మ‌ర్థ‌మైన ప‌నితీరుతో ఎదుగుతున్న నాయ‌కుడు. రాజీవ్ స‌తావ్ కుటుంబానికి, స్నేహితుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా. ఓం శాంతి’ అని ప్ర‌ధాని ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు.