రెబల్ టీఎంసీ ఎంపీలు 20 మంది ఎన్‌సీపీఐలో విలీనం..స్పీకర్ కు లేఖ

రెబల్ టీఎంసీ ఎంపీలు 20 మంది ఎన్‌సీపీఐలో విలీనం..స్పీకర్ కు లేఖ
తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)కు చెందిన మొత్తం 28 మంది లోక్‌సభ సభ్యులలో 20 మంది తమకు మద్దతుగా ఉన్నారని పేర్కొంటూ, ఆ పార్టీకి చెందిన అసమ్మతి ఎంపీలు ఆదివారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆయన నివాసంలో కలిశారు.  తాము త్రిపుర కేంద్రంగా పనిచేస్తున్న ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (ఎన్‌సీపీఐ)లో విలీనమయ్యామని, తద్వారా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే)కు మద్దతు ఇస్తున్నామని, సభలో ప్రత్యేక వర్గంగా (బ్లాక్‌గా) కూర్చోవాలని కోరుకుంటున్నామని వారు స్పీకర్‌కు తెలియజేశారు. 
 
ఈ పరిణామంతో, లోక్‌సభలో సభ్యుల సంఖ్యాబలం పరంగా బీజేపీ తర్వాత ఎన్డీయేలో ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’ రెండవ అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా అవతరించింది. 16 మంది ఎంపీలు ఉన్న టీడీపీని ఇది అధిగమించింది. ఈ పార్టీకి అస్సాం, త్రిపుర, బెంగాల్, ఈశాన్య ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో ఉనికి ఉంది. గతంలో ఈ పార్టీ త్రిపురలో ఎన్నికల్లో పోటీ చేసింది. 
 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అసమ్మతి టీఎంసీ ఎంపీలు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో సమావేశమైనప్పుడు ఈ విలీన ప్రతిపాదనపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో త్రిపురకు చెందిన బీజేపీ ఎంపీ బిప్లబ్ కుమార్ దేబ్ కూడా పాల్గొన్నారని, అక్కడ విలీన ప్రతిపాదనపై చర్చ జరిగిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.  ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి వేటు పడకుండా తప్పించుకునేందుకు టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
 
అంతకుముందే, మమతా బెనర్జీ వర్గం స్పీకర్‌ను సంప్రదించి, “ఎఐటిసి (తృణమూల్ కాంగ్రెస్)కు చెందినట్లుగా చెప్పుకునే ఏ ప్రత్యేక సమూహానికి లేదా వర్గానికి ఎటువంటి గుర్తింపు, హోదా లేదా సదుపాయం కల్పించవద్దు” అని కోరింది. కాగా, టీఎంసీలో మరో ఇద్దరు ఎంపీలు రెబల్‌ క్యాంపులో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని రెబల్‌ ఎంపీలకు నేతృత్వం వహిస్తున్న కకోలి ఘోష్‌ ప్రకటించారు. దీంతో తమ సంఖ్య 20 నుంచి 22కి చేరిందని కకోలి వెల్లడించారు. వారిద్దరూ తమ క్యాంపులో చేరిన తర్వాత పేర్లను ప్రకటిస్తామని తెలిపారు.
 
“ఎఐటిసి తరపున ఎన్నికైన మేము 20 మంది ఎంపీలం స్పీకర్‌ను కలిసి, సభలో ప్రత్యేక వర్గంగా కూర్చోవడానికి అనుమతించాలని కోరుతూ లేఖ సమర్పించాము. ఎఐటిసి మొత్తం బలానికి మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది ఉన్న ఈ 20 మంది ఎంపీల వర్గం ఇప్పుడు ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’తో కలిసి ఉంది. మేము దేశం కోసం పనిచేస్తాము. ప్రధాన మంత్రి నాయకత్వంలో ఎన్డీయేతో కలిసి పనిచేస్తాము,” అని టీఎంసీ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ విలేకరులతో పేర్కొన్నారు. 
 
“మేము ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’లో విలీనమయ్యాము. ఇది ఒక రాజకీయ పార్టీ. ఇది గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ. మేము అందులో విలీనమయ్యాము,” అని సీనియర్ టిఎంసి ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ చెప్పారు. “అసలైన టిఎంసి” ఏది అనేది కోర్టు నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.  ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ అనేది త్రిపుర కేంద్రంగా పనిచేస్తున్న, అంతగా ప్రాచుర్యం లేని ఒక రాజకీయ సంస్థ. ఘోష్ దస్తీదార్,  బంద్యోపాధ్యాయలతో కలిసి స్పీకర్‌ను కలిసిన ఎంపీలలో శతాబ్ది రాయ్, యూసుఫ్ పఠాన్, సాయోని ఘోష్, జూన్ మాలియా , జగదీష్ బసునియా ఉన్నారు.
 
స్పీకర్ అధికారిక నివాసానికి (20, అక్బర్ రోడ్) వెళ్లే ముందు, ఈ అసమ్మతి ఎంపీలు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో సమావేశమయ్యారు. యాదవ్ గతంలో బెంగాల్ ఎన్నికల కోసం బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. అసమ్మతి ఎంపీలు స్పీకర్‌ను కలవడంతో, లోక్‌సభలో టీఎంసీ విభజన ఇప్పుడు అధికారికమైంది. బెంగాల్‌లో పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో సుమారు 60 మంది శాసనసభాపక్షంపై పట్టు సాధించి, రిటబ్రత బెనర్జీని తమ నాయకుడిగా ఎన్నుకోవడంతో మమతా బెనర్జీ ఇప్పటికే దానిపై నియంత్రణను కోల్పోయారు.
 
మరోవైపు, అసమ్మతి ఎంపీలు స్పీకర్‌ను కలవడానికి కొద్ది నిమిషాల ముందు, మమతా వర్గానికి చెందిన టీఎంసీ ఎంపీలు సాగరిక ఘోష్, కీర్తి ఆజాద్ టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అభిషేక్ బెనర్జీ రాసిన లేఖను స్పీకర్‌కు అందజేశారు. ఆ లేఖలో పార్టీ “ఏకైక, అవిభాజ్య రాజకీయ పార్టీ” అని పేర్కొన్నారు. 
 
“లోక్‌సభలోని శాసనసభాపక్షం తన ఉనికిని ప్రధాన రాజకీయ పార్టీ నుండే పొందుతుంది. ఆ పార్టీకి అనుబంధంగానే కొనసాగుతుంది. చట్టపరంగా చూస్తే ఒకే ఒక్క ఎఐటిసి (ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్), సభలో ఒకే ఒక్క పార్టీ నాయకుడు, ఒకే ఒక్క విప్ ఉంటారు. వీరందరూ రాజకీయ పార్టీ.  దాని సమర్థవంతమైన సంస్థాగత అధికారం ద్వారానే తమ పదవులను నిర్వహిస్తారు. ఏ సభ్యుడు లేదా సభ్యుల సమూహం కూడా తమంతట తాముగా అదే పార్టీలో సమాంతర ‘గ్రూప్’ లేదా ‘వర్గాన్ని’ ఏర్పాటు చేసుకుని, సభలో స్వతంత్ర గుర్తింపును కోరలేరు” అని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు.