ఎన్నికల హింసను మమతా గుర్తించి సరిదిద్దాలి 

ఎన్నికల హింసను మమతా గుర్తించి సరిదిద్దాలి 

పశ్చిమ బెంగాల్‌లో శాసన సభ ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండ శిక్షించే స్వభావంతో ఉందని ముఖ్యమంత్రి మమత బెనర్జీ గుర్తించి, సరిదిద్దాలని గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ కోరారు.

రాష్ట్రం కోవిడ్-19 మహమ్మారి వల్ల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దానికి తోడుగా శిక్షించే స్వభావంగల హింసాకాండ జరిగిందని  గవర్నర్పే ర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఇలాంటి హింసాత్మక సంఘటనల గురించి తాను గతంలో ఎన్నడూ వినలేదని విషయం వ్యక్తం చేశారు. 

శనివారం ఆయన నందిగ్రామ్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ హింసాకాండ వల్ల లక్షలాది మంది బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు అగ్ని పర్వతం మీద కూర్చున్నట్లు ఉన్నాయని, ఇతరులు నిర్బంధించడంతో ప్రజలు తమ ఇళ్ళను ఖాళీ చేశారని పేర్కొన్నారు.

రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నపుడు మనం నిద్రపోకూడదని ప్రభుత్వనాయికి హితవు చెప్పారు. ప్రజలు అన్ని రకాల నేరాలకు బాధితులవుతున్నారని, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, డబ్బు గుంజుకునే పన్నులు వంటివాటికి ప్రజలు బాధితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ధన్‌కర్ కోరారు. బాధితులకు పునరావాసం, విశ్వాసం కల్పించేందుకు,  నష్టపరిహారం అందజేసేందుకు మమత బెనర్జీ చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రజలను విభజించే శక్తుల ఆధిపత్యాన్ని నియంత్రించాలని కోరారు. 

బాధితులు పోలీసులను చూస్తే భయపడుతున్నారని, తమనే నిందితులుగా ఆరోపణలు నమోదు చేస్తారని ఆందోళన చెందుతున్నారని తెలిపారు.  నందిగ్రామ్ శాసన సభ నియోజకవర్గంలో మమత బెనర్జీ పరాజయాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు.