ఇంటిని కొవిడ్ కేంద్రంగా మార్చిన కర్ణాటక మంత్రి

కరోనా కేసులు భారీగాపెరుగుతుండటంతో, ఆసుపత్రులలో పడకలు దొరకడం సమస్యగా మారడంతో కర్నాటక హోంమంత్రి బస్వారాజు బొమ్మై హవేరి జిల్లా షిగ్గావిలోని తన ఇంటిని కొవిడ్​కేర్​సెంటర్ ​(సీసీసీ)గా మార్చారు. 50 మంది పేషెంట్లకు వసతులతో ఆ ఇంటి ఆవరణలో ఏర్పాట్లు చేశారు. ఇది ఉత్తర కర్ణాటకలో చిన్న పట్టణం. తన నియోజకవర్గంలో కరోనా చికిత్స కొరత తీర్చడం కోసం ఈ ఏర్పాటు చేశారు. 
 
అక్కడ వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, ఇతర సిబ్బందిని కూడా నియమించినట్లు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఇంటి వరండాలో 50 బెడ్లతో పాటు సివియర్​ పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన్​ను​ అందించేందుకు కాన్సంట్రేటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. 
 
ఓ మంత్రి తన నివాసాన్ని కొవిడ్​కేర్​సెంటర్​గా మార్చడం ఇదే తొలిసారని.. దీనివల్ల నియోజకవర్గంలోని తాలూకా ఆస్పత్రిపై భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నాయి. “50 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తో సహా ఈ పడకలను అన్ని వైద్య సదుపాయాలతో సహా నా ఇంట్లో ఏర్పాటు చేసాను. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు,  నర్స్ లతో సహా వైద్య బృందాలను అందుబాటులో ఉంచాను. ఇక్కడే కరోనా రోగులకు చికిత్స అందిస్తాము” అని మంత్రి వివరించారు. 
 
హుబ్బళిలో తన కుటుంబంతో నివసించే మంత్రి బొమ్మై తన నియోజకవర్గం పర్యటనకు వచ్చినప్పుడు షిగ్గావిలోని ఇంట్లో బస చేస్తుంటారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, జనతా పరివార్ నేత ఎస్ ఆర్ బొమ్మై కుమారుడు. ప్రస్తుతం రాష్త్ర మంత్రివర్గంలో న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలకు కూడా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 
 
ఇలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి లక్ష్మణ్ సవ్వడి బెళగావి జిల్లాలో 50 పడకల కేంద్రాన్ని కరోనా రోగుల కోసం ఏర్పాటు చేయడానికి రూ 50 లక్షలు ఖర్చు పెట్టారు. ఈ సదుపాయాన్ని శుక్రవారం కిత్తూర్ రాణి చెన్నమ్మ హాస్టల్ లో ప్రారంభించారు.