తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వాయిదా 

తెలంగాణ‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో ఉండ‌వు అని, క‌రోనా ఉధృతి త‌గ్గిన త‌ర్వాతే ఉంటాయ‌ని సీఈసీ తేల్చిచెప్పింది. ప‌రిస్థితులు మెరుగుప‌డినా త‌ర్వాతే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఆలోచిస్తామ‌ని పేర్కొంది. 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఖాళీల‌పై ఇటీవ‌లే ప్ర‌భుత్వం కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసింది. ఆ లేఖ‌పై చ‌ర్చించిన సీఈసీ ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు ఉండ‌వు అని త‌మ నిర్ణ‌యాన్ని తెలిపింది.

త్వరలో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తోంది. వీరిలో ఆరుగురి పదవీ కాలం వచ్చే నెల జూన్ 3న పూర్తవుతోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 16న ముగియ‌నుంది. 

వచ్చే నెలలో గడువు ముగుస్తున్న ఎమ్మెల్సీల్లో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిఫ్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకరేశ్వర్లు ఉన్నారు. 

ఇక, గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న మరో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి. కాగా, గవర్నర్ కోటాను భర్తీ చేసేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో ఈ ఖాళీ భర్తీ చేయాల్సి ఉంటుంది.