డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఆరోగ్య భద్రత అందించాలి

కోవిడ్ రోగులకు సేవలందిస్తున్న డాక్ట‌ర్ల‌కు, వైద్య సిబ్బందికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని  బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కోరారు. గురువారం ఆయ‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా ఆస్పత్రిని సందర్శించిన  సంద‌ర్భంగా తమిళనాడు తరహాలో తెలంగాణ‌ రాష్ట్రంలోనూ డాక్ట‌ర్ల‌కు, వైద్య సిబ్బందికి ఇన్సెంటివ్ ఇచ్చి ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. 

చాలా మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతూ ఎంజీఎంలో శోభారాణి అనే డాక్టర్ కే బెడ్ దొరకని పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు.  డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఆరోగ్య భద్రత, ఇన్సెంటివ్ ఇవ్వాలని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నామని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం వైద్యం విషయంలో ఎందుకు ఇతర రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవడం లేదని ప్ర‌శ్నించారు. 

50 వేల మంది సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా వారు ఎందుకు రావడం లేదో అర్థం చేసుకోవాలని హితవు చెప్పారు. ఉన్న సిబ్బందినే కాపాడుకోవడం లేదు కాబట్టే కొత్తవాళ్లు రావడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కు అందరూ రాజకీయాలకతీతంగా కట్టుబడి ఉండాలని కోరారు. ప్రజలను కాపాడాలనే రాష్ట్ర ప్రభుత్వ లాక్ డౌన్ నిర్ణయానికి కేంద్రం కూడా సహకరిస్తుందని తెలిపారు.

ప్రజలకు, కోవిడ్ పేషెంట్లకు ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెబుతూ పాజిటివ్ లెక్కలు, మరణాల లెక్కలు, క‌రోనా నివేదికలో తప్పులు ఇవ్వొద్దని హితవు చెప్పారు. ఇలా చేస్తే ప్రజలు కరోనా లేదనుకుని స్వేచ్ఛగా తిరిగే ప్రమాదముందని హెచ్చరించారు.

వాస్తవ నివేదికలిస్తేనే ప్రజలు జాగ్రత్తగా ఉంటారన్న బండి సంజ‌య్లా క్ డౌన్ వల్ల ఇబ్బందులు పడే వారికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. డాక్ట‌ర్లు, పారామెడికల్, పోలీసులు కరోనా కట్టడిలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.  2020 డిసెంబరులో రాష్ట్రంలో 5 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం నిధులిచ్చిందని చెప్పారు. అందులో ఒకటి కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేశారని, ఆక్సిజన్, రెమిడిసివర్ మందుల కొరత రాకుండా  కేంద్రం  సహకరిస్తోందని తెలిపారు.

కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందని చెబుతూ  కొంత మంది ప్రయివేటు ఆస్పత్రుల యజమానులు దురాశతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. క‌రోనా క‌ష్ట స‌మ‌యంలో అలాంటి వారి తీరు మారాలని సూచించారు. ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉందని, వారికి కూడా ప్రభుత్వం సమీక్ష చేసి సహకరించాలని సూచించారు. 440 టన్నుల ఆక్సిజన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే  బల్లారీ నుంచి కేటాయించామ‌ని గుర్తు చేశారు.