మే 13, 2026
1 min read
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పసునూటి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి నాలుగున్నర దశాబ్దాల పోరుబాటకు స్వస్తిపలికారు. సంతోష్ తన భార్యతో కలిసి మంగళవారం వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం (పట్టణ) పరిధిలోని సోమిడికి చెందిన పసునూరి సోమనారాయణ- నర్సమ్మకు ఐదుగురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు నరహరి.
5వ తరగతి వరకు సోమిడి ప్రభుత్వ పాఠశాల, హై స్కూల్ ప్రభుత్వ పాఠశాల కాజీపేట, 1980లో ఇంటర్ నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేసి, వరంగల్ నగరంలోని ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదివేందుకు చేరారు. 1982లో రాడికల్, నక్సలైట్ ఉద్యమాలు, విధానాలకు ఆకర్షితుడయ్యాడు. మూడు దశాబ్దాల క్రితం డిగ్రీ చదువుతున్న సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ ఎస్ యూ) ద్వారా పీపుల్స్‌వార్ గ్రూప్‌లో చేరారు.
నాటి పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, మరో నేత క్రాంతి రణదేవ్‌ల సహకారంతో నరహరి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారని తెలుస్తోంది. ఆయనకు శాస్త్ర సాంకేతిక విషయాలపై పట్టుండటంతో మావోయిస్టు పార్టీ టెక్నికల్ విభాగం బాధ్యతలు అప్పగించారు. ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత మావోయిస్టు అగ్రనేతలు ఒకరి తర్వాత మరొకరు లొంగిపోయినా నరహరి మాత్రం లొంగుబాటుకు ససేమిరా అన్నారని పోలీసువర్గాలు పేర్కొంటున్నాయి.
నరహరి భార్య ఏపీకి చెందిన మావోయిస్టు పార్టీ నాయకురాలని సమాచారం. మరో కేంద్ర కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రాతో కలిసి సరండా అటవీ ప్రాంతంలో నరహరి కార్యకలాపాలు నిర్వహించారు. మిసిర్ బెస్రా వర్గం సైతం లొంగుబాటుకు ప్రయత్నిస్తున్న క్రమంలో నరహరి తనకు తెలిసిన కొంతమంది ద్వారా తెలంగాణ పోలీసులను సంప్రదించినట్లు తెలుస్తోంది.
నరహరి, వార్తా శేఖర్ లొంగుబాటు తర్వాత ఇక తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి, ఆయన భార్య రత్నాభాయ్ మాత్రమే ఇంకా అజ్ఙాతంలో ఉన్నారని నిఘా వర్గా లు పేర్కొంటున్నాయి. గణపతి ఎక్కడున్నారనే విషయంలో పూర్తి స్పష్టత రావడం లేదని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. అడవుల్లో భద్రతా బలగాల ఒత్తిడి పెరుగడం, మరోవైపు అనారోగ్య కారణాల రీత్యా జార్ఖండ్ అడవుల నుంచి రహస్యంగా తెలంగాణ పోలీస్‌ల వద్దకు చేరుకున్న ఈ దంపతులు పోలీస్‌ల ఎదుట లొంగిపోయారు. సంతోష్ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి పెద్ద లోటుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
About The Author
Related
Tags: Maoist Narahari Warangal police

More Stories
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపతి
దీనదయాళ్ కు దత్తాత్రేయ ఘనంగా నివాళులు
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి 27న హాజరుకై ఈడీ సమన్లు