దేశ ఆర్థిక స్వావలంబన, జాతీయ ప్రయోజనాలు, ప్రజల భాగస్వామ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన “సప్త సూత్రాలు” కేవలం ప్రభుత్వ విధానాలు మాత్రమే కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో అమలు కావాల్సిన జాతీయ ఆర్థిక ఉద్యమమని ప్రముఖ ఆర్ధిక నిపుణులు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి తెలిపారు. `సప్త సూత్రాలు’పై బిజెపి రాష్ట్ర మీడియా టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ సామాన్య ప్రజలు తమ దైనందిన జీవితంలో చిన్నచిన్న మార్పులు తీసుకొస్తే దేశ ఆర్థిక శక్తిని గణనీయంగా బలోపేతం చేయవచ్చని తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సవాళ్లు, విదేశీ మారక ద్రవ్య వినియోగం వంటి అంశాలను గణాంకాలతో వివరించారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం, ఇంధన వినియోగంలో బాధ్యత, వంటనూనె వినియోగ నియంత్రణ, సహజ వ్యవసాయం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి అంశాలు దేశ ఆర్థిక స్థిరత్వానికి ఎలా దోహదపడతాయో విశ్లేషించారు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు సూచించిన 10 ప్రధాన సూచనలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. దేశ ఆర్థిక బలోపేతం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, స్వదేశీ వినియోగం, ఇంధన పొదుపు, దేశీయ పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలు భారత ఆర్థిక భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తాయని ఆయన తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని సూచనలు రాజకీయ అంశాలు కావని, అవి దేశ ఆర్థిక భద్రత, సామాజిక బాధ్యతలకు సంబంధించినవని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా “లోకల్ ఫర్ వోకల్” భావనతో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఖర్చుల్లో మితవ్యయం పాటించాలని, ప్రధాని స్వయంగా తన కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించుకుని ఆదర్శంగా నిలిచారని ఆయన కొనియాడారు. ప్రజలు కూడా అవసరమైనప్పుడు మాత్రమే వ్యక్తిగత వాహనాలను వాడాలని, హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మెట్రో, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఐటీ రంగంలో అమలవుతున్న కార్‌పూలింగ్ విధానం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇంధన పొదుపుకు ఎంతో మేలు చేస్తాయని ఆయన చెప్పారు. బిజెపి రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులు పాల్గొన్నారు.

More Stories
ఫార్ములా ఈ కారు రేసు కేసులో జులై 31న విచారణకు కేటీఆర్
మావోయిస్ట్ నేత నరహరి భార్యతో సహా లొంగుబాటు?
తెలుగు రాష్ట్రాలకు తాగునీటికి కృష్ణా జలాలు విడుదల