ఫార్ములా ఈ కారు రేసు కేసులో జులై 31న విచారణకు కేటీఆర్  

ఫార్ములా ఈ కారు రేసు కేసులో జులై 31న విచారణకు కేటీఆర్  
ఫార్ములా ఈ కారు రేసు కేసులో జూలై 31న విచారణకు హాజరు కావాలంటూ మాజీ మంత్రి కెటిఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, బిఎల్‌ఎన్ రెడ్డిలకు గురువారం ఏసిబి కోర్టు సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసిన ఏసిబి అ ధికారులు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసు ను విచారణకు స్వీకరించిన ఏసిబి కోర్టు ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకుని నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కెటిఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్‌ఎన్ రెడ్డికి సమన్లు జారీ చేసింది.
 
కేసులో ఏ1 గా కెటిఆర్, ఏ2 గా అర్వింద్ కుమార్, ఏ3గా బిఎల్‌ఎన్ రెడ్డి, ఏ4గా కన్సల్టెంట్ మల్లేశ్వరరావు, ఏ5గా ఎఫ్‌ఈఓ సం స్థను ఏసిబి చేర్చింది. కాగా, గత ప్రభుత్వం హయాంలో హైదరాబాద్‌లో 2023 ఫిబ్రవరి 11న జరిగిన ఫార్ములా -ఈ కార్ రేస్ నిర్వహణ కోసం ప్రభుత్వ అనుమతి, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ క్లియరెన్స్ లేకుండానే హెచ్‌ఎండిఏ నుంచి ఎఫ్‌ఈఓ(ఫార్ములా ఈ ఆపరేషన్స్) సంస్థకు రూ.55 కోట్లు చెల్లించారన్న ప్రధాన ఆరోపణతో ఏసిబి కేసు నమోదు చేసింది. 

 
హెచ్‌ఎండిఏ ఖాతా నుంచి సుమారు రూ.55 కోట్లను ఎఫ్‌ఈఓ సంస్థకు బదిలీ చేసినట్లు ఏసిబి దర్యాప్తులో గుర్తించింది. మొదటి సీజన్ తర్వాత రెండో సీజన్ నిర్వహణకు ఎఫ్‌ఈఓ(ఫార్ములా- ఈ ఆపరేషన్స్)తో ఒప్పందం చేసుకునేందుకు కెబినెట్ ఆమోదం లేదని, అయినా రూ.110 కోట్లకు అంగీకారం తెలిపారని ఏసిబి పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఎనిమిది మిలియన్ పౌండ్లు విదేశాలకు బదిలీ చేశారన్న ఆరోపణ కూడా ఉండడంతో, దీనిపై ఇడి కూడా విచారణ జరుపుతోంది. 
 
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో రెండవ సీజన్ రద్దు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండో సీజన్ రద్దు చేయడంతో ఎఫ్‌ఈఓ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. దీంతో 2023 డిసెంబర్‌లో ప్రభుత్వం మారిన తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్‌పై ఏసిబి ప్రాథమిక విచారణ ప్రారంభించింది. జనవరి 2024లో కేసు నమోదు చేసి, ఇప్పటికే పలువురు అధికారులను విచారించింది. 
 
అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా హెచ్‌ఎండిఏ నుంచి నిధుల విడుదలకు అర్వింద్ కుమార్ ఆమోదం తెలిపారని ప్రధాన ఆరోపణ ఉంండగా, హెచ్‌ఎండిఏ చీఫ్ ఇంజనీర్‌గా రేస్ ట్రాక్ నిర్మాణం, చెల్లింపుల ప్రక్రియలో బిఎల్‌ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఏసిబి భావిస్తోంది. కాగా, జూలై 31న ముగ్గురి వాంగ్మూలం నమోదు తర్వాత ఏసిబి చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు ఈ కేసులో ఈడీ కూడా సమాంతరంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది.