యుపి కోవిడ్ పరీక్షలకు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు

గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసించింది. అత్యధిక జనాభాగల ఈ రాష్ట్రంలో కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేయడాన్ని ట్విటర్ వేదికగా మెచ్చుకుంది.

భారత దేశంలో అత్యధిక జనాభాగల రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వేను ప్రారంభించిందని పేర్కొంది. కోవిడ్-19 లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేసి, ర్యాపిడ్ ఐసొలేషన్‌లో ఉంచడానికి, డిసీజ్ మేనేజ్‌మెంట్, కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం పరీక్షలు నిర్వహిస్తోందని తెలిపింది. 

97,941 గ్రామాల్లో కోవిడ్ లక్షణాలున్నవారిని పరీక్షించేందుకు మానిటరింగ్ టీమ్స్ ప్రతి ఇంటిని సందర్శిస్తున్నట్లు తెలిపింది. కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయినవారిని ఐసొలేషన్‌లో ఉంచుతున్నారని, డిసీజ్ మేనేజ్‌మెంట్‌పై సలహాలను ఇస్తూ, ఓ మెడిసిన్ కిట్‌ను అందజేస్తున్నారని తెలిపింది. 

కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయినవారితో ఇటీవలి కాలంలో కలిసి మెలిగినవారిని క్వారంటైన్‌లో ఉంచి, పరీక్షిస్తున్నారని పేర్కొంది. కోవిడ్ లక్షణాలు లేనివారిని వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుతున్నారని పేర్కొంది. ఈ వ్యాధి ప్రబలకుండా నిరోధించేందుకు మార్గదర్శకాలను పాటించాలని కోరుతున్నారని పేర్కొంది.