మ‌హారాష్ట్ర‌, యూపీ, ఢిల్లీలో త‌గ్గిన క‌రోనా కేసులు

మ‌హారాష్ట్ర‌, యూపీ, ఢిల్లీ, చ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాల్లో కొవిడ్-19 కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం ఊర‌ట క‌లిగిస్తోంది. ఈ రాష్ట్రాల్లో రోజువారీ కొవిడ్-19 పాజిటివ్ కేసుల న‌మోదు తగ్గ‌గా క‌ర్నాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో క‌రోనా కేసులు అధిక‌మ‌య్యాయ‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది.

 24 గంట‌ల్లో ఢిల్లీలో 12,481 తాజా కేసులు వెలుగుచూడగా పాజిటివిటీ రేటు 17.76 శాతానికి తగ్గింది. మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి ఒక్క‌రోజే దేశ రాజ‌ధానిలో 347 మంది మ‌ర‌ణించారు. ఇక 13 రాష్ట్రాల్లో ల‌క్ష‌కు పైగా యాక్టివ్ కేసులున్నాయ‌ని, 26 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతం పైగా ఉంద‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే, క‌రోనా వైర‌స్ ప్ర‌భావం దేశంలోని 13 రాష్ట్రాల్లో అత్య‌ధికంగా ఉన్న‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌, ప‌శ్చిమబెంగాల్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, బీహార్ రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ల‌క్ష‌కు పైగా ఉన్న‌ద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. 

ఈ 13 రాష్ట్రాల జాబితాలో 5,93,150 యాక్టివ్ కేసులతో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉండ‌గా.. 1,05,104 కేసుల‌తో బీహార్ చివ‌రి స్థానంలో ఉన్న‌దని తెలిపింది. ఇదిలావుండగా, మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా 18 కోట్ల వ్యాక్సిన్ డోసులను అర్హులకు వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరొక 90 లక్షల డోసులు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. 

వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 7 లక్షలకు పైగా అదనపు కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసులను సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కేరళ, మహారాష్ట్రలతో సహా పలు రాష్ట్రాలు కోవిడ్ -19 వ్యాక్సిన్ల కొరతను నివేదించిన తరువాత  ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది.