దేశంలో కాస్త తగ్గిన కరోనా తీవ్రత

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. మొన్నటి దాకా నాలుగు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. నిన్న 3.60లక్షల వరకు తగ్గగా.. తాజాగా 3.30లక్షలకు దిగువన కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,29,942 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. 

దీంతో తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,29,92,517 పెరిగింది. కొత్తగా 3,56,082 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,90,27,304 మంది కోలుకున్నారు. మరో 3,876 మంది మృత్యువాతపడగా.. మహమ్మారి బారినపడి మొత్తం 2,49,992 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 37,15,221 ఉన్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.

మరో వైపు టీకా డ్రైవ్‌ ముహ్మరంగా సాగుతోంది. టీకా డైవ్‌ సోమవారం నాటికి 115వ రోజుకు చేరగా.. మొత్తం 17,27,10,066 డోసులు వేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. రోజువారీ కేసులు, మరణాల్లో కర్ణాటకలో అత్యధికంగా నమోదయ్యాయి. మొదటి వరకు భారీగా కేసులు నమోదైన మహారాష్ట్ర దేశంలో అత్యధిక కేసుల్లో రాష్ట్రాల జాబితాలో రెండో స్థానానికి చేరింది. 

కర్ణాటకలో నిన్న 39,305 కొత్త కేసులు, 596 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 37,236 కేసులు, 549 మరణాలు రికార్డయ్యాయి. మరో వైపు సోమవారం దేశంలో భారీగా కొవిడ్‌ పరీక్షలు జరిగాయి. ఒకే రోజు 18,50,110 టెస్టు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఐసీఎంఆర్‌ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 30.56 కోట్లుకుపైగా టెస్టులు చేసినట్లు వివరించింది.