బెంగాల్ ప్రతిపక్ష నేతగా సువేందు అధికారి

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్ర‌తిప‌క్ష నేత‌గా బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఎన్నికయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేందరూ సువేందు అధికారిని ప్ర‌తిప‌క్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రతిపక్ష నేత పదవి కోసం సువేందు అధికారితో పాటు మనోజ్ తిగ్గా, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ కూడా పోటీ పడ్డారు. 

ప్రతిపక్ష నేతను ఎన్నుకోవడం కోసం బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌, పార్టీ జాతీయ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ భూపేంద‌ర్ యాద‌వ్‌లను పరిశీలకులుగా నీయ‌మించింది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై గెలిచిన సువేందునే ఎన్నుకునేందుకు ఆసక్తి చూపించింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అధికారి పేరును ప్రతిపాదించగా పలువురు ఎమ్యెల్యేలు సమర్ధించారు. అధికారిని ఎన్నుకోవడం ద్వారా బెంగాల్ లో రాబోయే రోజులలో మమతా ప్రభుత్వంపై బీజేపీ సాగించే పోరాటాలకు ఆయన నాయకత్వం వహింపనున్నారనే సంకేతం ఇచ్చిన్నట్లయింది.

పార్టీ కార్యకర్తలు అండగా ఉంటూ, తృణమూల్ సాగిస్తున్న దాడులను తిప్పికొడుతూ వారికి రక్షణ కల్పించే నేతగా అధికారి పేరొందారు. గత వారం రోజులుగా నందిగ్రాంలో అధికార పార్టీ అరాచకాలను ముందుండి ఎదుర్కొంటున్నారు. అధికారిని ప్రతిపక్ష నేతగా చేయడం ద్వారా అధికార పార్టీ అరాచకాలను తిప్పి కొట్టాలని బిజెపి ధృడ నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమైన సందేశం ఇచ్చిన్నట్లు అయింది.

ఈ సందర్భంగా తనను ఎన్నుకున్న పార్టీ సీనియర్ నేతలు,  ఎమ్యెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతూ తన బాధ్యతలను నెరవేర్చడానికి ధృడంగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ ఎన్నికలలో మూడు ప్రధాన అంశాలు జరిగాయని గుర్తు చేశారు. బెంగాల్ చరిత్రలో మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన వ్యక్తి (మమతా బనెర్జీ) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని తెలిపారు.

రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా కాంగ్రెస్, వామపక్షాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయినదని చెప్పారు. అదే సమయంలో మొదటి సారిగా 77 మంది సభ్యులతో బిజెపి ఒక పెద్ద పక్షంగా ఆవిర్భవించిన్నదని పేర్కొన్నారు.

బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. తృణమూల్‌ దాడుల నుంచి కార్యకర్తలను రక్షించుకోవటం కోసం మిగిలిన ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ చెప్పారు. ప‌శ్చిమ బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాల‌కు గానూ బీజేపీ 77 స్థానాల్లో గెలుపొందగా.. మ‌మ‌తా బెనర్జీపై 1,956 ఓట్ల తేడాతో సువేందు అధికారి విజయం సాధించారు. 

ఇలా ఉండగా,  ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్‌లో చెలరేగిన హింస నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి చెందిన 61 మంది ఎమ్మెల్యేలకు ‘ఎక్స్’ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

వీరందరికీ సీఐఎస్‌ఎఫ్ భద్రతను కల్పించాలని నిర్ణయం తీసుకుంది. గతంలో 70 మందికి సీఐఎస్‌ఎఫ్ భద్రతను కల్పించేవారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత బీజేపీ, అధికార తృణమూల్ కార్యకర్తల మధ్య హింస చెలరేగింది. కొందరు మృతి చెందారు.