బెంగాల్ నేతల ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి

అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి మూడోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి గవర్నర్ జగదీప్ ధంకర్‌ పెద్ద షాక్అ ఇచ్చారు. నారద టేపుల కేసులో ఇదివరకటి మమత ప్రభుత్వంలోని నలుగురిపై సీబీఐ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి జారీ చేసారు.

వారిలో ఇద్దరు (సుబ్రత ముఖర్జీ, ఫిర్హాద్ హకీం) సోమవారం నాటి విస్తరణలో మంత్రి పదవులు పొందారు.  గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి మంజూరు చేసిన మరో ఇద్దరు మాజీ మంత్రుల్లో మదన్ మిత్రాకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మరో మంత్రి సోవన్ చటర్జీ తృణమూల్ నుంచి 2019 ఆగస్టులో బీజేపీలోకి మారిపోయారు. తర్వాత అందులో నుంచి కూడా బయటకు వచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.

లోక్‌సభ సభ్యుల ప్రాసిక్యూషన్‌కు స్పీకర్ అనుమతి తప్పనిసరి. అలాగే ఎమ్మెల్యేల ప్రాసిక్యూషన్ కు అసెంబ్లీ స్పీకర్ అనుమతి కావాలి. కానీ సీబీఐ మంత్రుల ప్రాసిక్యూషన్ అంటూ గవర్నర్ దగ్గరకు వెళ్లింది. ఆరుగురు ఎంపీలు, నలుగురు మంత్రులు లంచం తీసుకోవడం నారద టేపుల్లో రికార్డు అయింది. అందులో ఒకరు చనిపోయారు. కొందరు పార్టీలు మారారు.

సంబంధిత కేసుకు సంబంధించిన అన్ని పాత్రలను సమర్పించిన తర్వాత, తనకు గల అధికారాలను ఉపయోగించుకొని గవర్నర్ ఈ నేతల ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇస్తున్నట్లు రాజ్ భవన్ గత రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నది.