చైనాలో మానవహక్కులు ప్రశ్నించిన  న్యూజిలాండ్

చైనాపై త‌క్కువ‌గా ప్రత్యక్ష విమర్శలు చేసే న్యూజిలాండ్.. ఇప్పుడు త‌న‌ వైఖరిని మార్చుకున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు చైనాను ప్ర‌త్య‌క్షంగా ఏనాడూ న్యూజిలాండ్ విమ‌ర్శించ‌లేదు. అయితే జిన్జియాంగ్‌లో మానవ హక్కులపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ నేరుగా చైనాను లక్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు. న్యూజిలాండ్ తాజా ప్రకటన చైనా పట్ల వారి మారుతున్న దృక్పథాన్ని సూచిస్తుందని చెప్ప‌వ‌చ్చు.

త‌న‌ ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న‌ చైనాలో మానవ హక్కుల సమస్యపై ఇప్పుడు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో న్యూజిలాండ్ క‌లిసి వస్తున్నట్లు కనిపిస్తున్న‌ది. 

ఆక్లాండ్‌లో జరిగిన చైనా బిజినెస్ మీట్‌లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా.. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన వ్య‌క్తం చేశారు. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోని ఉయ్గార్లపై అనుస‌రిస్తున్న తీరుతోపాటు హాంగ్‌కాంగ్ లో ప్ర‌జ‌ల నిర‌స‌న‌ల‌పై కూడా జెసిండా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో ఉయ్గార్ ముస్లింలను హింసల‌కు గురిచేసిన విష‌యం ప్రపంచమంతా తెలిసిన తర్వాత చైనా ఇప్పుడు అబద్ధాలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న‌ది.

 ఉయ్గార్స్‌పై ది మౌంటెన్స్ – లైఫ్ ఆఫ్ జిన్జియాంగ్ అనే డాక్యుమెంటరీ తయారు చేయడం ద్వారా జిన్జియాంగ్‌లో అంతా బాగానే ఉందని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తున్న‌ది. చైనా నుంచి వచ్చిన ఈ వీడియోలో ఉయ్గార్ కార్యకర్తలు ఇవి తప్పుడు వీడియోలు అని తేల్చిచెప్పారు.