టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా ఆమోదం

కరోనా మహమ్మారితో ప్రపంచమంతా సతమతమవుతోంది. వైరస్‌ కట్టడికి టీకానే ప్రధాన ఆయుధంగా భావిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో కీల‌క‌మైన టీకా మేధో సంప‌త్తి హ‌క్కుల‌ రద్దుకు జోబైడైన్‌ నేతృత్వంలోని అమెరికా మద్దతు తెలిపింది. 

మహమ్మారిపై పోరులో ప్రపంచ దేశాలకు మద్దతునిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌ ట్రేడ్‌ ప్రతినిధి కేథరిన్ వెల్లడించారు. మేథో సంపత్తి హక్కుల పరిరక్షణకు.. బైడెన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కానీ, వైరస్‌ అంతానికి కరోనా టీకాలకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌ రద్దుచేసేందుకు అమెరికా మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. 

ఈ అంశంలో ప్రపంచవాణిజ్య సంస్థ సూత్రాలకు అనుగుణంగా.. అంతర్జాతీయ ఒప్పందాలు కుదిరేందుకు సమయం పడుతుందని కేథరిన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కోసం అనేక దేశాలు టీకాలు ఉత్పత్తి చేసేలా.. అంతర్జాతీయ వాణిజ్య నియమాలను సరళీకృతం చేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.

అయితే, పలు అభివృద్ధి చెందిన దేశాలు, బ‌ల‌మైన ఫార్మాసూటిక‌ల్ కంపెనీలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. డ‌బ్ల్యూటీవో నిబంధ‌న‌ల ప్రకారం.. దీనికి ఏకాభిప్రాయం కావాల్సి ఉండగా.. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. అగ్ర దేశాల‌ను ఈ విష‌యంలో ఒప్పించ‌డానికి దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా మద్దతు తెలుపడం కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే, అమెరికా తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ బుధవారం ప్రశంసించారు. నిర్ణయం చారిత్రాత్మకమని అభివర్ణించారు.