భూమి వైపు దూసుకొస్తున్న చైనా రాకెట్ శకలాలు

కొవిడ్ భయంతో అల్లాడుతున్న ప్రపంచానికి చైనా రాకెట్ భయం ముంచుకొస్తోంది. ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి చైనా చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా ఏప్రిల్ 29న చైనా లాంగ్‌మార్చి 5 బి అనే రాకెట్ తియాన్హే స్పేస్ మాడ్యూల్‌ను అంతరిక్షం లోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష లోకి చేర్చింది. 

ఈ మాడ్యూల్ పొడవు 30 మీటర్లు. అయితే ఆ రాకెట్ శకలాలు పొరపాటున తాత్కాలిక కక్ష లోకి చేరాయి. అవి ఇప్పుడు భూమి పైకి దూసుకు వస్తున్నాయి. ఈ రాకెట్ బరువు దాదాపు 21 టన్నులు. సాధారణంగా ఏ రాకెట్ కూలిపోయినా ఆ శకలాలు సముద్రంలో పడుతుంటాయి. కానీ చైనా ప్రయోగించిన లాంగ్ మార్చి 5 బి రాకెట్ మాత్రం భూమి పైకి దూసుకు వస్తోంది. 

ఈ వారాంతంలో భూ వాతావరణంలోకి ప్రవేశించే ఈ రాకెట్‌ లొకేషన్‌ను గుర్తించే పనిలో ఉన్నామని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ మంగళవారం వెల్లడించింది. ‘అమెరికా స్పేస్‌ కమాండ్‌’ రాకెట్‌ మార్గాన్ని పసిగట్టే పనిలో ఉన్నదని వివరించింది. ‘శనివారం (మే 8)న లాంగ్‌ మార్చ్‌ 5బీ భూ వాతావరణంలో ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నాం. ప్రవేశానికి కొన్ని గంటల ముందే ఆ విషయం తెలుస్తుంది’ అని అమెరికా రక్షణ విభాగం ప్రతినిధి మైక్‌ హోవర్డ్‌ తెలిపారు. 

‘లాంగ్‌ మార్చ్‌ 5బీ’ రాకెట్‌ శకలాలు జనావాసాలపై కూలుతాయేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది కచ్చితంగా ఏ ప్రదేశంలో భూ వాతావరణంలో ప్రవేశిస్తుందో అంచనా వేయలేక పోతున్నారు. ఈ రాకెట్ మార్గాన్ని అమెరికా స్పేస్ కమాండ్ నిశితంగా పరిశీలిస్తోంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) ప్రత్యామ్నాయంగా, తమ కోసం ప్రత్యేకంగా ‘టియాన్‌హే’ పేరిట ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని చైనా ఓ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘టియాన్‌హే’ నిర్మాణం కోసం గత గురువారం ‘లాంగ్‌ మార్చ్‌ 5బీ’ రాకెట్‌ను ప్రయోగించింది. 

అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం తీసుకెళ్లిన కొంత సామగ్రిని రాకెట్‌ కక్ష్యలో ప్రవేశపెట్టి పని ముగించింది. అనంతరం ఆ రాకెట్‌ శకలాలు పొరపాటున మరో తాత్కాలిక కక్ష్యలోకి చేరాయి. అలా నియంత్రణ కోల్పోయిన ఆ శకలాలు అక్కడినుంచి భూమి వైపునకు వేగంగా దూసుకువస్తున్నాయి.