అణు కేంద్రాల వ‌ద్ద ల్యాంచ్ ప్యాడ్లు నిర్మిస్తున్న చైనా

అణు కేంద్రాల వ‌ద్ద ల్యాంచ్ ప్యాడ్లు నిర్మిస్తున్న చైనా

చైనాలోని ఎడారి ప్రాంతం ఉయ్‌గ‌ర్‌లో ఉన్న న్యూక్లియ‌ర్ ప్లాంట్ వ‌ద్ద భారీగా నిర్మాణాలు జ‌రుగుతున్నాయి. జిన్‌జియాంగ్‌లో ఉన్న మిలిట‌రీ కాంప్లెక్స్ వ‌ద్ద చైనా తాజాగా చేపట్టిన నిర్మాణాలలో న్యూక్లియ‌ర్ మిస్సైళ్ల‌కు చెందిన ల్యాంచ్ ప్యాడ్ల‌ను త‌యారు చేస్తోందని భావిస్తున్నారు. అమెరికాలోని ఏ న‌గ‌రాన్నైనా చేరుకునే సామ‌ర్థ్యం క‌లిగిన అణు క్షిప‌ణులు చైనా వ‌ద్ద ఉన్న విష‌యం తెలిసిందే. 

అయితే తాజాగా విడుదలైన శాటిలైట్ ఫోటోలు చైనా ఆయుధ శ‌క్తిని చాటుతున్నాయి. న్యూక్లియ‌ర్ ఆయుధాల‌ను దాచిపెట్టే స్థావ‌రాల వ‌ద్ద భారీ స్థాయిలో ల్యాంచ్ ప్యాడ్లు, బంక‌ర్లు, క‌మ్యూనికేష‌న్ కేంద్రాలు నిర్మిస్తున్న‌ట్లు ఆ శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిసింది. అతి సుదీర్ఘ దూరం ప్ర‌యాణించే క్షిప‌ణులు ఆ కేంద్రం వ‌ద్ద ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఉయ్‌గ‌ర్ మిలిట‌రీ కేంద్రం వ‌ద్ద సుమారు 80 ల్యాంచ్ ప్యాడ్ల‌ను చైనా నిర్మిస్తున్న‌ది. మొబైల్ మిస్సైల్ లాంచ‌ర్లు, ఎయిర్ డిఫెన్స్ బ్యాట‌రీ ద‌ళాల సంఖ్య‌ను పెంచుకుంటోంది. రాయిట‌ర్స్ సంస్థ రిలీజ్ చేసిన దృశ్యాల ప్ర‌కారం ఎల‌క్ట్రానిక్ వార్‌ఫేర్‌, శాటిలైట్ క‌మ్యూనికేష‌న్స్‌, క‌మాండ్ ఆప‌రేష‌న్స్ సంబంధించిన కేంద్రాల‌ను డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు తెలిసింది. 

గ‌తంలో ఈ స్థాయిలో నిర్మాణాలు అక్క‌డ లేన‌ట్లు పేర్కొన్నారు. కానీ ఒక్క‌సారిగా చైనా భారీ ఎత్తున న్యూక్లియ‌ర్ స్థావ‌రాల వ‌ద్ద నిర్మాణాలు చేప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. న్యూక్లియ‌ర్ ద‌ళాల ర‌క్ష‌ణ కోసం కొత్త త‌ర‌హా నిర్మాణాలు చేప‌డుతున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. 

ఎడారి ప్రాంతంలోని కొన్ని వేల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు జ‌రుగుతున్న‌ట్లు హ‌వాయి ప‌సిఫిక్ ఫోర‌మ్‌కు చెందిన అలెగ్జాండ‌ర్ నీల్ తెలిపారు. ఎడారి ప్రాంతంలో ఉన్న స్థావ‌రాల ర‌క్ష‌ణ కోసం ఈ నిర్మాణాలు చేప‌డుతున్న‌ట్లు భావిస్తున్నారు. జిన్‌జియాంగ్ ప్రాంతం, ఘాన్సు ప్రావిన్సులో ఉన్న న్యూక్లియ‌ర్ ఫోర్స్ ఆ స్థావ‌రాల ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు చేప‌డుతున్న‌ది.

చైనా  వేగంగా విస్తరిస్తున్న అణు మౌలిక సదుపాయాలు విదేశీ ప్రభుత్వాలు, ఆయుధ నియంత్రణ నిపుణుల నుండి పెరుగుతున్న పరిశీలనను ఆకర్షిస్తున్నాయి. బీజింగ్ అణు ఆధునీకరణ కార్యక్రమం, దాని భవిష్యత్ వ్యూహాత్మక ఉద్దేశ్యాల చుట్టూ ఉన్న పారదర్శకత లోపం గురించి కొంతమంది పాశ్చాత్య దౌత్యవేత్తలు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.