రెండు బ్రెజిలియన్ ముఠాలను అమెరికా ప్రపంచ ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించింది. బ్రెజిల్‌కు చెందిన కమాండో వెర్మెల్హో (సివి), ప్రైమిరో కమాండో డా క్యాపిటల్ (పిసిసి) చర్యలు ప్రపంచ ఉగ్రవాద సంస్థల చర్యలను పోలి ఉన్నాయని, అందుకే వీటిని ప్రపంచ ఉగ్రవాద (ఎస్‌డిజిటిలు) సంస్థలుగా పరిగణించడం జరుగుతుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సల్వా తిరస్కరించారు. అసలెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అమెరికాను లూలా ప్రశ్నించారు. కమాండో డా క్యాపిటల్, కమాండో వెర్మోల్హో ఈ రెండు గ్రూపులు బ్రెజిల్‌లో అత్యంత హింసాత్మక నేర సంస్థలు. ఈ రెండు సంస్థల ప్రభావం కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితమై లేదు. దేశవ్యాప్తంగా విస్తరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు.
జూన్ 5 నుంచి ఈ రెండు గ్రూపులను విదేశీ ఉగ్రవాద సంస్థలు (ఎఫ్‌టిఓ)గా పరిగణించడం జరుగుతుందని మార్కో రూబియో తెలిపారు. కాగా, మార్కో రూబియో ప్రకటనపై లూలా డా సల్వాచా స్పందిస్తూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వాటి సంబంధిత నేరాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం సమర్థవంతంగా దోహదపడదని లూలా ఎక్స్ పోస్టులో నొక్కి చెప్పారు.
విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే బ్రెజిల్ భూభాగంలో అమెరికా చేపట్టబోయే చర్యలను సమర్థించుకునేందుకు తీసుకున్న వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవాలనే నెపంతో బ్రెజిల్‌లో సైనిక జోక్యం చేసుకోవాలని వాషింగ్టన్‌ను బ్రెజిల్ మితవాద నాయకుడు బోల్సోనారో కోరుతున్నారు. ఆయన ఆ అవకాశాన్ని కూడా బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా విమర్శించారు.
కాగా, సివి, పిసిసి గ్రూపులను అమెరికా ప్రపంచ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడంపై బ్రెజిల్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బ్రెజిల్ ఒక సార్వభౌమాధికార దేశం అని, లక్షలాది కుటుంబాలు నివశిస్తున్న ప్రాంతాల్లో నేరపూరిత సంస్థలైన పిసిసి, సివి గ్రూపులు చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా బ్రెజిల్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ సంస్థలు నేరాల ద్వారా, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమణ రవాణా ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందడమే లక్ష్యంగా పెట్టుకుంటాయని పేర్కొంటూ అలాంటి ఈ సంస్థల్ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పోల్చకూడదని స్పష్టం చేశారు. ఎందుకంటే సైద్ధాంతిక, రాజకీయ, మతపరంగా అంతర్జాతీయ ఉగ్రవాదంతో ముడిపడి ఉండే ఆ సంస్థల చర్యలతో బ్రెజిల్ సివి, పిసిసి గ్రూపులను పొరపాటున కూడా చేర్చకూడదని తేల్చి చెప్పారు.

More Stories
సుదీర్ఘ యుద్ధాలతో ఇజ్రాయిల్ ప్రజల్లో మానసిక సమస్యలు
అమెరికా- ఇరాన్ మధ్య ప్రాథమిక ఒప్పందం
కెనడాలో భారత విద్యార్థిని దారుణ హత్య