మయన్మార్‌లో శాటిలైట్‌ టివిలు నిషేధం 

మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని కుప్పకూల్చి…అధికారాన్ని చేజిక్కించుకున్న జుంటా సైన్యం మరోసారి వార్తా సంస్థలపై విరుచుకుపడింది. అక్కడ జరుగుతున్న హింసాకాండను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తున్న స్వతంత్ర వార్తా సంస్థలను కట్టడి చేసేందుకు శాటిలైట్‌ టివిని పూర్తిగా నిషేధించింది. 

శాటిలైట్‌ డిష్‌లను వాడే ఎవరిపైనైనా సరే భారీ జరిమానాలతో పాటు శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఎవరైనా శాటిలైట్‌ డిష్‌లను వాడుతూ టివిలను చూస్తున్నట్లయితే 500,000 క్యాత్‌ (320 డాలర్స్‌) జరిమానా లేదా ఏడాది పాటు జైలు శిక్ష తప్పదని స్టేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ కౌన్సిల్‌ ఇప్పటికే ప్రకటన చేసింది.

కొన్ని అక్రమ సంస్థలు, వార్తా సంస్థలు..శాటిలైట్‌ ద్వారా ఇక్కడి భద్రతా దళాలపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయంటూ మిలటరీ ఆరోపించింది. అదేవిధంగా మీడియా, అంతర్జాలంపై నిబంధనలు విధించింది. 

డెమొక్రటిక్‌ వాయిస్‌ ఆఫ్‌ బర్మా (డివిబి), మిజిమా వంటి స్వతంత్ర సంస్థలను లక్ష్యంగా చేసుకుని శాటిలైట్‌ టివిపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టమౌతోంది. మార్చిలో వీటి లైసెన్సును జుంటా సైన్యం రద్దు చేసినప్పటికీ…శాటిలైట్స్‌ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాయి. 

ఈ నిషేధం కారణంగా విదేశీ వార్తా సంస్థలపై కూడా ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఈ నెల 4న రెండు వార్తా సంస్థలపై నిషేధం విధించింది. ఈ అణచివేత చర్యలపై పలువురు సైన్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు.