మ‌య‌న్మార్‌లో సైన్యం కాల్పుల్లో 8 మంది మృతి 

మ‌య‌న్మార్‌లో ఆర్మీ అణ‌చివేత విధానం కొన‌సాగుతున్న‌ది. సైన్యం కాల్పుల్లో ఆదివారం నాడు 8 మంది చ‌నిపోయారు. దేశంలో సోషల్ మీడియా, ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు. ప‌లు వార్తా ఛాన‌ళ్ల‌ను త‌మ ఆధీనంలోకి తీసుకుని న‌డిపిస్తున్న ఆర్మీ.. ఇప్పటివరకు 48 మంది జర్నలిస్టులను కూడా అరెస్టు చేశారు

మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న‌ ప్రదర్శనలను సైన్యం ఎక్క‌డిక‌క్క‌డ‌ అణ‌చివేస్తున్న‌ది. సైన్యం జరిపిన కాల్పుల్లో 8 మంది నిరసనకారులు మరణించారు. ప్రజలు సైన్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తుండ‌టంతో సైన్యం అడ్డుకున్న‌ది. సైన్యాన్ని దాటుకుని ముందుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో సైనిక బ‌ల‌గాలు కాల్పులు జ‌రిపారు. 

సైన్యం విధానాలకు వ్యతిరేకంగా యాంగోన్, మాండలే నగరాల్లో నిరసనలు జరుగుతున్నాయి. వైట్‌లెట్ పట్టణంలో ముగ్గురు వ్యక్తులను కాల్చి చంపినట్లు స్థానిక మీడియా తెలిపింది. అదే సమయంలో, షాన్ రాష్ట్రంలోని మురికివాడలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

ఆదివారం యాంగోన్‌లోని పోలీసు బ్యారక్స్ వెలుపల బాంబు పేలుడు జరిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా పేలుడు సంఘటనలు జరిగాయి. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో జరుగుతున్న వివిధ ప్రదర్శనల్లో 759 మంది ప్రాణాలు కోల్పోయారని ఆస్టిటెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజ‌న‌ర్స్‌ (ఏపీపీపీ) తెలిపింది. 

సైన్యం దేశ‌వ్యాప్తంగా సోషల్ మీడియాను నిషేధించడంతో పాటు సమాచారాన్ని నియంత్రించడం ప్రారంభించింది. సైన్యం 48 మంది జర్నలిస్టులను అరెస్టు చేసింది. తర్వాత 23 మందిని వ‌దిలేసింది. అనేక స్వతంత్ర మాధ్యమాలను కూడా నిషేధించారు. 

ఇక్కడి జుంటా ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్సాప్‌లను నిషేధించారు. సైన్యమే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను స్వయంగా నియంత్రిస్తున్న‌ది. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి ఇంట‌ర్నెట్‌పై గంట‌ల నిషేధం ఉండ‌గా.. గ‌త నెల 15 నుంచి మొబైల్ ఇంట‌ర్నెట్ కూడా నిలిపివేశారు.