ఎన్నికల సంబరాలపై ఈసీ ఆగ్రహం 

త‌మ ఆదేశాల‌ను బేఖాత‌రు చేసి ఎన్నిక‌ల సంబ‌రాల‌ను జ‌రుపుకుంటున్న వారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాల చీఫ్ సెక్ర‌ట‌రీల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. దేశంలో కొవిడ్ సంక్షోభం కార‌ణంగా విజ‌యోత్స‌వ ర్యాలీలు, సంబ‌రాల‌పై ఈసీ నిషేధం విధించింది. 

అయినా కూడా ఈ ఆదేశాలను ఎవ‌రూ పాటించ‌డం లేదు. ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడుల‌లో ఆయా పార్టీల కార్య‌క‌ర్త‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ విష‌యాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన ఈసీ.. వెంట‌నే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది.

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం శాసన సభల ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పూర్తి ఫలితాలు వెలువడక ముందే రాజకీయ పార్టీల కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఒక చోట చేరుతున్నారని, వేడుకలు జరుపుకుంటున్నారని తన దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఇటువంటి సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాలని, కేసులు నమోదు చేయాలని ఈ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదివారం ఆదేశించింది.

ఇటువంటి వేడుకలను నిలవరించడంలో విఫలమయ్యే స్టేషన్ హౌస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని ఆదేశించింది. ఇటువంటి అన్ని సంఘటనలపైనా తక్షణమే సమాచారం అందజేయాలని, వాటిపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని తెలిపింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత విజ‌యోత్స‌వాలు నిర్వ‌హించ‌కుండా మాత్రం ఈసీ నిషేధం విధిస్తూ వారం క్రిత‌మే ఆదేశాలు కూడా జారీచేసింది. కానీ, ఈసీ ఆదేశాలు జ‌నం భేఖాత‌రు చేశారు. ఈసీ ఆదేశాల‌ను అస్స‌లు ప‌ట్టించుకోకుండా జ‌నం విజ‌యోత్స‌వాల్లో మునిగి తేలుతున్నారు.

ప‌శ్చిమ‌బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ శ్రేణులు, త‌మిళ‌నాడులో డీఎంకే శ్రేణులు జోరుగా సంబురాలు జ‌రుపుకుంటున్నారు. త‌మ అభిమాన నేత‌ల ఇండ్ల ముందు గుంపులుగా చేరి నృత్యాలు చేస్తున్నారు. ఒక‌రికి ఒక‌రు స్వీట్లు తినిపించుకుంటున్నారు. ఈ ఆదేశాలను లెక్క‌చేయ‌క‌పోవ‌డ‌మేగాక‌, మాస్కు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం అనే కొవిడ్ నిబంధ‌న‌లను కూడా తుంగ‌లో తొక్కారు.

ఈసీ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో పోలీసులు రంగంలోకి దిగారు. డీఎంకే, టీఎంసీ కార్యకర్తలకు ఈసీ ఆదేశాల గురించి వివరించి, వేడుకల నిర్వహణను ఆపాలని కోరారు. వారికి నచ్చజెప్పి కోవిడ్ నిబంధనలను పాటించేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో భారీ ఎత్తున ఎన్నికల సభలు నిర్వహించడంపై ఇటీవల మద్రాస్ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని తప్పుబట్టిన సంగతి తెలిసిందే.