బెంగాల్‌, అస్సాం, కేర‌ళ మ‌ళ్లీ అధికార పార్టీల‌వే.. త‌మిళ‌నాడులో డీఎంకే!

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మ‌ళ్లీ అధికార పార్టీల హ‌వానే క‌నిపిస్తోంది. ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్‌కు స్ప‌ష్ట‌మైన ఆధిక్యం వ‌చ్చేసింది. ఆ పార్టీ ఏకంగా 200 మార్క్‌పై క‌న్నేసింది. బీజేపీ భారీగా పుంజుకున్నా.. అధికారానికి ఆమ‌డ దూరంలో నిలిచిపోవ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఇక కేర‌ళ‌లో సాంప్ర‌దాయానికి విరుద్ధంగా వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రానుంది పిన‌ర‌యి విజ‌యన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌కు అనుగుణంగానే కేర‌ళ‌లో ఎల్డీఎఫ్ కూట‌మికి స్ప‌ష్ట‌మైన ఆధిక్యం ల‌భించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 

ఇప్ప‌టికే ఆధిక్యాల ప‌రంగా మ్యాజిక్ ఫిగ‌ర్ 71 స్థానాల మార్క్‌ను ఆ కూట‌మి దాటేసింది. దీంతో విజ‌య‌న్ వ‌రుస‌గా రెండోసారి ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఇక లాంచ‌నంగానే క‌నిపిస్తోంది.

అటు అస్సాంలో బీజేపీ మ‌రోసారి అధికారంలోకి రానుంది. ప్ర‌స్తుత ట్రెండ్స్ ప్ర‌కారం ఆ పార్టీ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను ఎప్పుడో దాటేసింది. బీజేపీ కూట‌మి 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

త‌మిళ‌నాడులోనే అధికార అన్నా డీఎంకే అధికారం కోల్పోయేలా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలంత కాక‌పోయినా.. ప్ర‌తిప‌క్ష డీఎంకే లీడింగ్‌లో ఉంది. ఇప్ప‌టికే ఆధిక్యంలో ఉన్న స్థానాల ప‌రంగా మ్యాజిక్ ఫిగ‌ర్ 117 స్థానాల‌ను డీఎంకే కూట‌మి దాటేసింది. ఆ లెక్క‌న త‌మిళ‌నాడు త‌ర్వాతి సీఎంగా స్టాలిన్ ప్ర‌మాణం చేయ‌డం ఖాయ‌మ‌నే చెప్పొచ్చు.

ఇక పుదుచ్చేరిలో ఎన్డీయే చేతికి అధికారం ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి. 30 స్థానాల‌కుగాను 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎన్డీయే కూట‌మి.. అధికారం చేప‌ట్టే దిశ‌గా అడుగులు వేస్తోంది.