బైడెన్ వంద రోజుల పాలనలో భారత్ తో బలపడిన మైత్రి  

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలి 100 రోజుల పాలన గురించి ఆ దేశ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ వివరించారు. భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతర్జాతీయ సమగ్ర భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. అమెరికా ఈ వంద రోజుల్లో భారత దేశంపై అత్యంత శ్రద్ధను ప్రదర్శించిందని చెప్పారు.

గడచిన 100 రోజుల్లో భారత దేశంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచినట్లు తెలిపారు. దేశాధ్యక్షుడు జో బైడెన్ బుధవారం రాత్రి స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్‌లో భారత దేశం గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్యగల లోతైన భాగస్వామ్యాన్ని, ఈ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్న విషయాన్ని అత్యంత సూక్ష్మంగా గ్రహించవచ్చునని తెలిపారు. 

బైడెన్ స్వయంగా ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడారని పేర్కొన్నారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ టోనీ బ్లింకెన్ని , భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో చాలాసార్లు మాట్లాడారని వివరించారు. ఇరు దేశాల మధ్య అత్యున్నత స్థాయి చర్చలు అనేకసార్లు జరిగినట్లు తెలిపారు. 

వాతావరణ మార్పులపై ప్రత్యేక దౌత్యాధికారి జాన్ కెర్రీ కూడా భారత్‌లో పర్యటించారని ఈ సందర్భంగా ప్రస్తావించగారు. డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ భారత్‌లో పర్యటించారని, భారత్-అమెరికా మధ్య భద్రతా సహకారం గురించి చర్చించారని తెలిపారు. 

భారత దేశంతో అనేక రకాలుగా సంబంధాలను కొనసాగిస్తున్నామని వివరించారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డయలాగ్‌కు వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

వాతావరణం, ఆరోగ్య రంగాల్లో భారత్‌కు సహకరిస్తామని పేరొంటూ  కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఈ సంబంధాలు మరింత బలోపేతమైనట్లు తెలిపారు. జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిని 2021 జనవరి 20న చేపట్టారు. 2020 నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించిన సంగతి తెలిసిందే.