ప్రపంచ మీడియా ఏకపక్ష కథనాలను తిప్పికొట్టండి 

కోవిద్ రెండో వేవ్ ను కట్టడి చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం విఫలమైనదని అంటూ అంతర్జాతీయ మీడియా అందిస్తున్న ఏకపక్ష కథనాలను తిప్పి కొట్టాలని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రపంచంలో భారత దౌత్యవేత్తలు అందరికి ఆదేశాలు ఇచ్చారు.
భారత రాయబారులు, భారత కమిషనర్లతో వర్చ్యువల్ సమావేశం జరుపుతూ హెచ్చరిక సంకేతాలను విస్మరించి పశ్చిమ బెంగాల్ లో దీర్ఘకాలం ఎన్నికలు జరపడం, కుంభమేళాను రద్దు చేయక పోవడం వంటి చర్యలకు పాల్పడినట్లు అంతర్జాతీయంగా ప్రముఖ వార్త పత్రికాలు, న్యూస్ చానెల్స్ `ఏకపక్ష’ కధనాలు ఇస్తూ ఉండడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆక్సిజన్ కంటైనర్లు, వెంటిలేటర్లు, ఔషధాలు, వాక్సిన్ ల వంటి వనరులను వివిధ దేశాల నుండి   సమీకరణకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను వివరించాలని ఆయన సూచించారు. రాయబారులతో పాటు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వి మురళీధరన్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష శృంగలా, కోవిద్ సంక్షోభాన్ని చూస్తున్న ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం అత్యవసరమైన వాటిని సమీకరించి, కస్టమ్స్, ఇతర ఇబ్బందులు లేకుండా భారత్ కు చేరుకొనే విధంగా చేయడానికి తీసుకో వలసిన చర్యల గురించి కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తున్నది. అంతర్జాతీయంగా వస్తున్న “ప్రతికూల” మీడియా కథనాలతో డీలా పడిపోకుండా భారత్ చేస్తున్న “సానుకూల” కృషి తెలియచెప్పే ప్రయతనం చేయాలని జైశంకర్ సూచించారు.
రెండో వేవ్ అన్నది ప్రపంచంలో ప్రజారోగ్య నిపుణులు ఎవ్వరు ఊహించినది కాదని, సంపన్న దేశాలలో సహితం ఆరోగ్య మౌలిక సదుపాయాలు మొదటి వేవ్ లోనే కుప్పకూలిన సమయంలో భారత్ విజయవంతంగా ప్రమాదాలను అవకాశంగా మార్చుకున్నదని ఆయన గుర్తు చేశారు.
అదేవిధంగా ఆక్సిజన్ కొరత సహితం ఉత్పత్తి తగ్గుదల వల్లన కాదని, కేవలం కొన్ని ప్రాంతాలలోనే ఉత్పత్తి కేంద్రికుర్థం కావడం, దూర ప్రాంతాలకు రవాణా చేయడంలో ఏర్పడిన ఇబ్బందులని వివరించారు. ఎన్నికలు, ప్రచారంకు కోవిద్ కేసులు పెరగడానికి సంబంధం లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్నికలు జరగని మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలలో కోవిద్ కేసులు అత్యధికంగా ఉండడాన్ని ఈ సందర్భంగా జైశంకర్ గుర్తు చేశారు.