4.5 ల‌క్ష‌ల‌ రెమ్‌డెసివిర్ వైల్స్ దిగుమ‌తి

క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తున్న‌ది. రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య 4 ల‌క్ష‌ల‌కు చేరుగా మ‌ర‌ణాల సంఖ్య మూడు వేలు దాటింది. ఈ నేప‌థ్యంలో క‌రోనా చికిత్స‌లో అత్య‌వ‌సర సంద‌ర్భాల్లో వినియోగించే యాంటీ వైర‌ల్ డ్ర‌గ్ రెమ్‌డెసివిర్‌ను విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం తెలిపింది. 

ప్ర‌భుత్వానికి చెందిన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్‌ అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ ఇంక్, ఈజిప్ట్ ఫార్మా కంపెనీ ఎవా ఫార్మా నుంచి 4,50,000 రెమ్‌డెసివిర్ వైల్స్‌ను తెప్పిస్తున్న‌ట్లు పేర్కొంది.

తొలి స్టాక్ కింద 75 వేల రెమ్‌డెసివిర్ వైల్స్‌ శుక్ర‌వారం చేరుతాయ‌ని కేంద్ర ర‌సాయ‌న‌, ఫెర్టిలైజ‌ర్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మ‌రో రెండు మూడు రోజుల్లో అమెరికా ఫార్మా కంపెనీ నుంచి 75 వేల నుంచి ల‌క్ష వ‌ర‌కు వైల్స్ స‌ర‌ఫ‌రా అవుతాయ‌ని, మే 15 నాటికి మ‌రో ల‌క్ష వైల్స్ చేరుతాయ‌ని వివ‌రించింది. 

ఈజిప్ట్‌కు చెందిన ఇవా ఫార్మా తొలుత ప‌ది వేల వైల్స్ పంపుతుంద‌ని, అనంత‌రం ప్ర‌తి 15 రోజుల‌కు 50 వేల చొప్పున జూలై వ‌ర‌కు రెమ్‌డెవిసిర్ వైల్స్‌ను స‌ర‌ఫ‌రా చేస్తుంద‌ని వెల్ల‌డించింది.

మ‌రోవైపు దేశంలో రెమ్‌డెసివిర్ ఉత్ప‌త్తిని కూడా వేగ‌వంతం చేసిన‌ట్లు కేంద్రం తెలిపింది. ఏప్రిల్ 27 నాటికి లైసెన్స్ పొందిన ఏడు దేశీయ డ్ర‌గ్ కంపెనీలు రెమ్‌డెసివిర్ ఉత్ప‌త్తిని నెల‌కు 38 ల‌క్ష‌ల నుంచి 1.03 కోట్ల‌కు పెంచాయ‌ని చెప్పింది. 

గ‌త వారంలో దేశ‌వ్యాప్తంగా 13.73 ల‌క్ష‌ల వైల్స్‌ను స‌ర‌ఫ‌రా చేశాయ‌ని వివ‌రించింది. అన్ని రాష్ట్రాల‌కు రోజు వారీ స‌ర‌ఫ‌రా 67,900 నుంచి 2.09 ల‌క్ష‌ల‌కు పెరిగిన‌ట్లు వెల్ల‌డించింది.