మూడో విడుత టీకా కోసం 2.45 కోట్ల రిజిస్ట్రేషన్లు

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారికి మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయనుండగా.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మూడో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ టీకా అర్హుల జాబితాలో కేంద్రం చేర్చిన విషయం తెలిసిందే. ఇందు కోసం కొవిన్‌ పోర్టల్‌, ఆరోగ్య సేతు యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. 
 
దేశంలో రోజు రోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌కు స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 2.45 కోట్ల మంది లబ్ధిదారులు కొవిన్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకున్నట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28న 1.37 కోట్లకుపైగా పేర్లను నమోదు చేసుకోగా.. 29న 1.04 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని పేర్కొంది.
 
దేశవ్యాప్తంగా జనవరి 16న ప్రారంభించిన టీకా డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతుందని, ఇప్పటి వరకు 15.22 కోట్ల డోసులకుపైగా టీకా డ్రైవ్‌లో వేసినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. శుక్రవారం ఉదయం 7 గంటల వరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం.. 22,43,097 సెక్షన్ల ద్వారా 15,22,45,179 వ్యాక్సిన్‌ మోతాదులను వేసినట్లు ప్రకటించింది. 
 
ఇందులో 93,86,904 మంది ఆరోగ్య కార్యకర్తలకు మొదటి డోసు.. 61,91,118 రెండో డోసు వేసినట్లు చెప్పింది. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో 1,24,19,965 మందికి మొదటి డోసు, 67,07,862 మందికి రెండో మోతాదు అందజేసినట్లు పేర్కొంది. 60 ఏళ్లు దాటిన వ్యక్తులకు 5,19,01,218 మొదటి మోతాదు, 1,04,41,359 మంది లబ్ధిదారులు రెండో మోతాదు వేసినట్లు తెలిపింది.
 
45-60 ఏళ్ల మధ్య వయస్కుల్లో 5,17,78,842 మందికి మొదటి మోతాదు, 34,17,911కి రెండో మోతాదు వేసినట్లు వివరించింది. మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, కేరళ, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దేశంలో వేసిన టీకా మోతాదుల్లో 67.08శాతం ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. 
 
24 గంటల్లో 21 లక్షలకుపైగా మోతాదులు వేసినట్లు చెప్పింది. టీకా డ్రైవ్‌ గురువారం నాటికి (ఏప్రిల్‌ 29) 104వ రోజుకు చేరగా.. ఒకే రోజు 22,24,548 వ్యాక్సిన్‌ మోతాదులను 21,810 సెక్షన్లలో వేసినట్లు పేర్కొంది. ఇందులో 12,74,803 మందికి మొదటి డోసు, 9,49,745 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు వేసినట్లు వివరించింది.