కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ లో ముసలం

కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ లో ముసలం
ఇటీవల జరిగిన ఐదు అసెంబ్లీలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, కేరళలో మాత్రం ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక పూర్తి కాలేదు. దీనంతటికీ కారణం కేరళ కాంగ్రెస్ పార్టీలోని వర్గ విబేధాలే. సీఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చక పోవడంతో కేరళ కాంగ్రెస్ పార్టీలో ముసలం ఏర్పడినట్లు కనిపిస్తోంది.
 
ఎన్నికల ఫలితాలు వెలువడి తొమ్మిది రోజులు అవుతున్నా ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత వెలువడటం లేదు.  ముఖ్యమంత్రి పదవి కోసం ముగ్గురు సీనియర్ నేతలు రమేష్ చెన్నితాల, వి.డి.సతీశన్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్ ) కె.సి. వేణుగోపాల్ లు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. 63 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు — మొత్తం 66 మంది సభ్యుల మద్దతును ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. 

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర వహించిన కేసీ వేణుగోపాల్‌ కు సహజంగానే ఎక్కువమంది ఎమ్యెల్యేలు మద్దతు తెలుపుతున్నారు. అయితే గత ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఎల్డిఎఫ్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాడిన సతీషన్ కు పార్టీ శ్రేణులలో, ప్రజలలో మద్దతు కనిపిస్తున్నది.  పైగా, యూడీఎఫ్ లో 22 మంది ఎమ్యెల్యేలను గెల్చుకున్న  యుడిఎఫ్ కీలక మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్ )మద్దతు సహా క్షేత్రస్థాయిలో బలమైన మద్దతు సతీషన్ కు కనిపిస్తున్నది. 

ఒకవేళ వేణుగోపాల్ కు సిఎం పదవి ఇస్తే యుడిఎఫ్ రెండు ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారిస్తున్నారు.  ఒకటి ఆయనను అసెంబ్లీకి ఎన్నుకునేందుకు, రెండవది ప్రస్తుతం వేణుగోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అలప్పుజ లోక్ సభ స్థానానికి కొత్త ఎంపిని ఎన్నుకోవాల్సి వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో అది చాలా ప్రమాదకరమని ఆ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పైగా, ఒకవేళ వేణుగోపాల్‌ను సీఎం చేస్తే తాను ఆ మంత్రివర్గంలో చేరబోనని కూడా సతీషన్ స్పష్టం చేస్తున్నారు. 

మాజీ కెపిసిసి అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లను ఢిల్లీకి పిలిపించగా వారిలో సహితం ఎక్కువమంది వేణుగోపాల్ కె మద్దతు ఇచ్చిన్నట్లు చెబుతున్నారు.  అయితే ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఇద్దరు మాజీ కెపిసిసి అధ్యక్షులు సుధీరన్, మురళీధరన్ లు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిపై కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను లక్ష్యంగా చేసుకుని పోస్టర్లు వెలువడటం కలకలం రేపుతున్నాయి.

ప్రియాంక గాంధీ వయనాడ్ సిట్టింగ్ ఎంపీగా ఉండగా, రాహుల్ గాంధీ తన గత పదవీకాలంలో అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.  వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం సమీపంలో కనిపించిన ఈ పోస్టర్లు, వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రిగా నియమించవద్దని నాయకులను హెచ్చరించాయి. ఒక పోస్టర్‌లో, “మిస్టర్ రాహుల్, ప్రియాంక, వయనాడ్‌ను మర్చిపోండి. మీరు ఇక్కడ నుంచి మళ్లీ గెలవలేరు” అని రాసి ఉంది. 

మరొక పోస్టర్‌లో, “ఇది హెచ్చరిక కాదు. ఈ తప్పుకు కేరళ మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు” అని హెచ్చరించింది. మూడవ పోస్టర్‌లో, “మిస్టర్ రాహుల్, కె.సి. మీ పనివాడు కావచ్చు, కానీ కేరళ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు” అని పేర్కొంది.  గత వారం సతీసన్, వేణుగోపాల్ మద్దతుదారుల మధ్య నిరసనలు, పోస్టర్ ప్రచారాలు చెలరేగిన తర్వాత కేరళలో ఉద్రిక్తతలు చల్లారే వరకు పార్టీ నాయకత్వం వేచి చూస్తోందని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.  

వేణుగోపాల్‌కు మద్దతు ఇస్తున్నారని భావిస్తున్న కాబోయే ఎమ్మెల్యేలను సతీసన్ మద్దతుదారులు బహిరంగంగా నిలదీస్తున్నారు.  ‘కేసీ శిబిరం’లో భాగమని భావిస్తున్న నాయకులకు వ్యతిరేకంగా పలు నియోజకవర్గాల్లో నిరసనలు, బహిరంగ ఘర్షణలు, బెదిరింపు పోస్టర్లు వెలుగులోకి రావడం మొదలైంది.