హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం
భారతీయ జనతా పార్టీ హర్యానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అంబాలా, సోనిపట్‌లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన బీజేపీ, పంచకులాలో కూడా అజేయ ఆధిక్యంలో నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా కంచుకోటగా భావించే సంప్లా మున్సిపల్ కమిటీలో కూడా బీజేపీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంది. సంప్లాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం విశేషం. 
 
ఫలితాల అనంతరం బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, అసోంలో విజయాల తర్వాత హర్యానాలో కూడా ప్రజలు పార్టీపై విశ్వాసం ఉంచారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలకు ప్రజలు మరోసారి మద్దతు తెలిపారని పేర్కొన్నారు.
 
కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన సైనీ, ప్రజలు ఆ పార్టీని మరోసారి తిరస్కరించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎప్పుడూ అబద్ధాల ఆధారంగానే ముందుకు సాగుతుంది. ప్రజలు ఇప్పుడు వారి అసలు స్వరూపాన్ని గుర్తించారు చెప్పారు.  హూడా ప్రభావం ఉన్న సంప్లాలో బీజేపీ గెలుపుపై స్పందిస్తూ, ప్రజలకు ఇక హూడాపై విశ్వాసం లేదు. ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నారు అని సైనీ ఆరోపించారు. 
 
తమ ప్రభుత్వం నిజాయితీ, పారదర్శకతతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. అధికారిక ఫలితాల ప్రకారం, అంబాలా మేయర్ పదవికి బీజేపీ అభ్యర్థి అక్షిత సైనీ, కాంగ్రెస్ అభ్యర్థి కుల్వీందర్ కౌర్‌పై 21,358 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి సోనియా రాణి మూడో స్థానంలో నిలిచారు. పంచకులా మేయర్ పదవికి బీజేపీ అభ్యర్థి శ్యామ్‌లాల్ బన్సల్, కాంగ్రెస్ అభ్యర్థి సుధా భారద్వాజ్‌పై అజేయ ఆధిక్యం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రాజేష్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు. 
 
సోనిపట్ మేయర్ పదవికి బీజేపీకి చెందిన రాజీవ్ జైన్, కాంగ్రెస్ అభ్యర్థి కమల్ దేవాన్‌పై 23,247 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థి ఆనంద్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం పంచకులా, అంబాలా, సోనిపట్ మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం .సంప్లా మున్సిపల్ కమిటీలో బీజేపీ అభ్యర్థి ప్రవీణ్, స్వతంత్ర అభ్యర్థి అంకిత్‌పై 687 ఓట్ల తేడాతో గెలుపొందారు. 
 
ధారూహెరాలో బీజేపీ అభ్యర్థి సత్యనారాయణ్ అలియాస్ అజయ్ జాంగ్రా, స్వతంత్ర అభ్యర్థి బాబూలాల్‌పై 6,236 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది.అయితే ఉక్లానాలో బీజేపీ అభ్యర్థి నికితా గోయల్, స్వతంత్ర అభ్యర్థి రీమా సోనీ చేతిలో 2,806 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. రేవారి మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ అభ్యర్థి వినీతా పిప్పల్, కాంగ్రెస్ అభ్యర్థి నేహారికపై 21,445 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 
 
అంబాలా మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ 16 వార్డులు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు మూడు వార్డులు దక్కాయి. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. సోనిపట్ మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ 17 వార్డులు గెలుచుకోగా, కాంగ్రెస్ ఐదు వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది. కొన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థుల కంటే కూడా వెనుకబడ్డారు. పంచకులా మున్సిపల్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఇప్పటివరకు బీజేపీ 10 వార్డుల్లో ఆధిక్యం సాధించింది.