భారత్‌కు సాయంకు ముందుకొచ్చిన 40కిపైగా దేశాలు

మన దేశంలో ప్రస్తుత పరిస్థితులు మునుపెన్నడూ లేవని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా తెలిపారు. కోవిడ్-19 రెండో ప్రభంజనం విజృంభించడంతో 40కి పైగా దేశాలు మనకు సాయపడేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 

గతంలో ఈ దేశాలకు మనం సాయపడ్డామని, ఇప్పుడు అవి తిరిగి మనకు సహాయపడుతున్నాయని పేర్కొన్నారు. ‘‘ఇది మునుపెన్నడూ లేని పరిస్థితి. ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. మనం చాలా దేశాల నుంచి వీటిలో చాలావాటిని (ఆక్సిజన్, ఔషధాలు వంటివాటిని) సేకరిస్తున్నాం” అని చెప్పారు.

మనకు సహాయపడేందుకు చాలా దేశాలు తమంతట తాము ముందుకు వస్తున్నాయి. మనం అందించిన సాయం విలువైనదని, తాము తిరిగి ఇస్తున్నామని ఆ దేశాలు చెప్తున్నాయని హర్షవర్ధన్ చెప్పారు. శుక్రవారం, రాబోయే రెండు రోజుల్లో అమెరికా నుంచి మూడు విమానాలు మన దేశానికి వస్తాయని తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడారని, విస్తృత స్థాయిలో సహాయపడతామని చెప్పారని తెలిపారు. వెంటిలేటర్లు, ఫవిపిరవిర్ ఔషధాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి గురువారం రాత్రి ఓ విమానం వస్తోందని చెప్పారు.

ఐర్లాండ్ నుంచి 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వస్తున్నాయన్నారు. ఫ్రాన్స్ నుంచి ఓ విమానం శనివారం వస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే కాకుండా మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, మారిషస్, భూటాన్ వంటి దేశాలు కూడా మనకు సాయపడేందుకు ముందుకు వచ్చాయని వివరించారు. 

లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్‌ను తయారు చేసే పరికరాలు, ఆక్సిజన్ జనరేటర్లు, కాన్సంట్రేటర్లు, క్రయోజనిక్ ట్యాంకర్లు, రవాణా పరికరాలు వంటివాటికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రెమ్‌డెసివిర్, టొసిలిజుమబ్ వంటి ఔషధాలు అత్యవసరమని చెప్పారు.

 ప్రస్తుతం మన దేశంలో రోజుకు 67 వేల డోసుల రెమ్‌డెసివిర్ ఉత్పత్తి అవుతోందని, ప్రస్తుతం రోజుకు రెండు నుంచి మూడు లక్షల డోసుల వరకు అవసరమని చెప్పారు. ఉత్పత్తిదారులు వీటి ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలిపారు.  రెమ్‌డెసివిర్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి పదార్థాల సరఫరాకు అమెరికా హామీ ఇచ్చిందని, ఈజిప్టు, ఇతర దేశాల్లోని మాన్యుఫ్యాక్చరర్లను కూడా సంప్రదిస్తున్నామని తెలిపారు. 

ఇక యునైటెడ్ కింగ్‌డ‌మ్ దేశానికి మూడు ఆక్సిజ‌న్ జ‌న‌రేష‌న్ యూనిట్ల‌ను పంపిస్తోంది. ఉత్త‌ర ఐర్లాండ్‌లో అధికంగా ఉన్న వీటిని ఇండియాకు పంపిస్తుండటం విశేషం. ఈ ఒక్కో యూనిట్ నిమిషానికి 500 లీట‌ర్ల ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేయ‌గ‌ల‌దు.  అంటే 50 మంది పేషెంట్లు ఒకేసారి ఉప‌యోగించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఇండియాలో ఏర్ప‌డిన ఆక్సిజ‌న్ కొర‌త‌ను ఇవి తీర్చ‌గ‌ల‌వు.

ఈ మినీ ఫ్యాక్ట‌రీలో ఒక్కొక్క‌టి షిప్పింగ్ కంటైన‌ర్ల సైజులో ఉంటాయి. ఇండియాలో ప‌రిస్థితులు త‌మ‌ను క‌ల‌చివేస్తున్నాయని యూకే ఆరోగ్య మంత్రి మ్యాట్ హాంకాక్ అన్నారు. యూకే నుంచి ఈ ఆక్సిజ‌న్ జ‌న‌రేష‌న్ యూనిట్లే కాకుండా మ‌రో 495 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, 200 వెంటిలేట‌ర్లు కూడా వ‌స్తున్నాయి.

హాంకాంగ్‌ నుంచి 300 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలు గురువారం రాత్రి భారత్‌ చేరుకున్నాయని కేంద్ర పౌర విమానాయనశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే అమలులో ఉన్న అన్ని ప్రయత్నాలను మరింత బలపరుస్తుందని ట్వీట్‌ చేశారు