పాకిస్థాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులను గుర్తు తెలియని గన్‌మెన్‌లు వరుసగా కాల్చి చంపుతున్నారు. గడిచిన కొద్ది నెలలుగా భారత్ లో వరుస పెట్టి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఆగంతకుల చేతిలో హతమవుతున్న ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా లష్కరే తోయిబా కీలక కమాండర్ షేక్ యూసుఫ్ అఫ్రిదీ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.
లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన అఫ్రిదీ మరణం ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో లష్కరే కార్యకలాపాలను పర్యవేక్షించే అఫ్రిదీని లక్ష్యంగా చేసుకుని దుండగులు మెరుపు దాడికి పాల్పడ్డారు. అతడిపై పలు రౌండ్ల కాల్పులు జరపడంతో.. తప్పించుకునే అవకాశం లేక అక్కడికక్కడే మరణించాడు. స్థానిక పోలీసులు దీనిని లక్షిత హత్యగా పరిగణిస్తున్నారు.
అమెరికా నిషేధిత జాబితాలో ఉన్న లష్కరే సంస్థకు అఫ్రిదీ కీలక వ్యూహకర్తగా వ్యవహరిస్తుండేవాడు. కేవలం అఫ్రిదీ మాత్రమే కాదు గత కొన్ని నెలలుగా పాకిస్థాన్‌లోని వివిధ నగరాల్లో ఉగ్రవాదుల ఏరివేత నిశ్శబ్దంగా సాగుతోంది. గత నెలలో లాహోర్‌లోని ఒక టీవీ స్టేషన్ వెలుపల లష్కరే వ్యవస్థాపక సభ్యుడు అమీర్ హంజాపై కాల్పులు జరిగాయి. అయితే అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తాహిర్ అన్వర్ కూడా ఇటీవలే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు రైట్ హ్యాండ్‌గా పేరున్న అబు ఖతాల్ (ఖతాల్ సింధీ)ను గతేడాది మార్చిలో జెహ్లమ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మట్టుబెట్టారు. 2024లో జమ్మూ కాశ్మీర్‌లోని రియాసిలో జరిగిన దాడులకు ఇతడే మాస్టర్ మైండ్ అని సమాచారం.
పాకిస్థాన్‌లో 2023 నుంచి ఈ తరహా మిస్టరీ హత్యలు ప్రారంభం అయ్యాయి. ఒక్క 2026 సంవత్సరంలోనే ఇప్పటి వరకు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన కనీసం 30 మంది కీలక ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. లాహోర్, కరాచీ వంటి నగరాల్లో ఉగ్రవాదుల కోసం పహారా కాస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరనేది ఇప్పటికీ పాక్ నిఘా సంస్థలకు అంతుచిక్కని మిస్టరీగా మారింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిన ఉగ్రవాదుల స్థావరాలపై ఈ దాడులు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

More Stories
పాక్ ద్వారా అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు?
బంగ్లాదేశ్ లో మరో హిందూ దారుణ హత్య
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఉన్నత విద్యావంతుడే!