అఖిలేష్ యాదవ్‌కు కరోనా పాజిటివ్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాద‌వ్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలిన‌ట్లు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు అఖిలేశ్ వెల్ల‌డించారు. 

గత కొన్ని రోజుల నుంచి త‌న‌తో ట‌చ్‌లో ఉన్న‌వారంతా క‌రోనా ప‌రీక్షలు చేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కొన్ని రోజుల నుంచి ఆయ‌న జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు.  ఈ నేప‌థ్యంలో ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌ల కోసం శ్యాంపిల్ ఇచ్చారు. ఇవాళ ఉద‌యం ఆ శ్యాంపిల్ రిజ‌ల్ట్ వ‌చ్చింది. దాంట్లో పాజిటివ్‌గా తేల‌డంతో ఆయ‌న ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు.

ఇలా ఉండగా,  దేశంలో క‌రోనా మ‌హమ్మారి విల‌య తాండ‌వం చేస్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 1027 మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. గ‌త ఆరు నెలల్లో 24 గంట‌ల్లో న‌మోదైన అత్య‌ధిక మ‌ర‌ణాలు ఇవే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక కేసుల సంఖ్య‌లో కొత్త రికార్డు న‌మోదైంది. 24 గంట‌ల్లో ఏకంగా 1,84,372 కేసులు న‌మోద‌య్యాయి. 

ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు, నైట్ క‌ర్ఫ్యులు పెట్టినా ఫ‌లితం లేకుండా పోతోంది. ఇక 24 గంట‌ల్లో 82,339 మంది క‌రోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం క‌రోనా బారిన ప‌డిన వాళ్ల సంఖ్య 1,38,73,825కు చేరుకోగా.. కోలుకున్న వాళ్లు 1,23,36,036గా ఉన్నారు. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 13,65,704 ఉన్నాయి.

వ‌రుస‌గా నాలుగో రోజూ ఇండియాలో ల‌క్ష‌న్న‌ర‌కుపైగా కేసులు న‌మోద‌య్యాయి. ఇక అమెరికా త‌ర్వాత ఒకే రోజులో ఇన్ని కేసులు వ‌చ్చిన దేశం కూడా భారత్ లోనే. క‌రోనా సెకండ్ వేవ్‌కు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. కేసులు ఆందోళ‌క‌ర స్థాయిలో పెరిగిపోతుండ‌టంతో ఇప్ప‌టికే వివిధ దేశాల్లో అనుమ‌తి పొందిన విదేశీ టీకాల వినియోగానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే.