అందరి సహకారంతోనే మహమ్మారిని ఓడించగలం

ప్రపంచ స్థితిగతులను మార్చడానికి కొవిడ్‌ మహమ్మారి అవకాశం కల్పించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేటి  సమస్యలను పరిష్కరించేందుకు, రేపటి సవాళ్లను ఎదుర్కొనేందుకూ కొవిడ్‌ ఓ అవకాశమని ఆయన పేర్కొన్నారు. కరోనాను ఓడించేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. 
 
‘రైసినా డైలాగ్‌’ అనే చర్చా కార్యక్రమంలో ఆన్‌లైన్‌ వేదికగా ప్రధాని మాట్లాడారు. దేశ ప్రజలను కొవిడ్‌ బారి నుంచి కాపాడేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. ‘‘మన పాస్‌పోర్టు ఫొటోలో మన రంగుతో నిమిత్తం లేకుండా అందరూ కలిసికట్టుగా కృషిచేస్తే తప్ప కరోనా మహమ్మారిని ఓడించలేమని స్పష్టం చేశారు. 
 
మహమ్మారి సమయంలో మనకు ఉన్న పరిమిత వనరులతో కరోనా కట్టడికి యత్నించామని చెబుతూ 1.3 బిలియన్ల మందిని రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాం. అదే సమయంలో 80కు పైగా దేశాలకు టీకాలు అందించామని పేర్కొన్నారు. 
 
కరోనా మహమ్మారిపై సమర్థంగా పోరాడాలంటే అందరికీ సమానంగా వ్యాక్సిన్‌ అందడం చాలా ముఖ్యమని, ఆ దిశగా ‘వ్యాక్సిన్‌ మైత్రి’ ద్వారా భారత్‌ కృషి చేస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు. 
 
కరోనాను కట్టడి చేయాలంటే భారత్‌ వంటి దేశాల్లో టీకా ఉత్పత్తిని మరింత పెంచడం ద్వారా అందరికీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేలా చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అన్న ధోరణితో భారత్‌ పనిచేస్తోందని, వ్యాక్సిన్‌ మైత్రి కార్యక్రమం ద్వారా వివిధ దేశాలకు టీకాలను సరఫరా చేస్తోందని తెలిపారు.