మహారాష్ట్రలో 15 రోజుల పాటు `జనతా కర్ఫ్యూ’ 

మహారాష్ట్రలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. రోజూ సగటున 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బుధవారం నుంచి మే 1 వరకు 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. లాక్‌డౌన్‌కు బదులుగా రాష్ట్రంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం  ప్రకటించింది.
 
వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నలుగురు కంటే ఎక్కువమంది గుమిగూడకుండా 144 సెక్షన్‌ విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో అత్యవసర సేవలు మాత్రమే అమల్లో ఉంటాయన్నారు. దవాఖానలు, బ్యాంకులు, మీడియా, ఈ-కామర్స్‌, పెట్రోల్‌ బంకులకు మినహాయింపునిచ్చారు. అవసరమైతేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని స్పష్టం చేశారు. 
 
అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని, అయితే ఇది లాక్‌డౌన్‌ మాత్రంకాదని స్పష్టతనిచ్చారు. కరోనాపై మరోసారి పోరు మొదలైందని ప్రకటించారు. ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో వచ్చే నెలలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి మూడు కిలోల గోధుమలు, రెండు కిలోల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేయనున్నట్టు ముఖ్యమంత్రి  తెలిపారు. 
 
కేసుల పెరుగుదల దృష్ట్యా రాష్ట్రంలోని కొవిడ్‌ దవాఖానల్లో పడకలు, ఆక్సిజన్‌,రెమ్‌డెసివిర్‌ ఔషధానికి కొరత ఏర్పడిందని అన్నారు. వాయుసేనకు చెందిన విమానాల ద్వారా వీటిని వెంటనే రాష్ట్రానికి  పంపాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
 
బుధవారం ఉదయం 7 గంటల నుండి పాఠశాలలు, ప్రార్థనామందిరాలు, థియేటర్లు, పార్కులు, జిమ్‌లు మూసివేస్తామని, హోటళ్లు, రెస్టారెంట్‌లలో పార్సిల్‌ సేవలను మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. మే 1 వరకు వాణిజ్య సంస్థలు, దుకాణాలు కూడా ఉండవని  స్పష్టం చేశారు.

రోజువారీ కార్మికులు, రిక్షా కార్మికులు, ఇంటిపనివారలు, భవన నిర్మాణ కార్మికులతో సహా అట్టడుగున ఉన్న వారికి సహాయం అందించేందుకు రూ.5,476 కోట్ల ప్యాకేజీని అందిస్తున్నట్లు తెలిపారు. 
కాగా, మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా 60,212 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఇవి 32శాతం ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు మంగళవారం 281 మంది కరోనాతో మరణించారు.