తగు సమయంలోపెట్రోలియం‌పై ఎక్సైజ్ సుంకం త‌గ్గింపు 

స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు పెట్రోలియం ఉత్ప‌త్తుల‌పై ఎక్సైజ్ సుంకం త‌గ్గించే విష‌య‌మై కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోనున్న‌ది. ఈ సంగ‌తి సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ (సీబీఐసీ) చైర్మ‌న్ ఎం అజిత్ కుమార్ చెప్పారు.

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో వ‌సూలైన ప‌రోక్ష ప‌న్నుల్లో 59 శాతానికి పైగా పెట్రోల్‌, డీజిల్ ఉత్ప‌త్తుల‌పై విధించిన ఎక్సైజ్‌, క‌స్ట‌మ్స్ సుంక‌మే ఉంది. మున్ముందు కూడా ప‌రోక్ష ప‌న్నుల రూపేణా రెవెన్యూ వ‌సూళ్లు మ‌రింత పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు అజిత్ కుమార్ తెలిపారు.

టైం వ‌చ్చిన‌ప్పుడు పెట్రోలియం ఉత్ప‌త్తుల‌పై క‌స్ట‌మ్స్‌, ఎక్సైజ్ సుంకం త‌గ్గించే విష‌య‌మై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అజిత్ కుమార్ చెప్పారు. పెట్రోల్, డీజిల్‌ల‌పై సుంకాలు ఎప్పుడు త‌గ్గిస్తార‌ని మీడియా ప్ర‌శ్నించిన‌ప్పుడు పై విధంగా ఆయ‌న స్పందించారు.

కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్‌, డీజిల్ ఉత్ప‌త్తుల‌పై సుంకాల‌ను త‌గ్గిస్తుందా? అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేదు. గ‌తేడాది లీట‌ర్ పెట్రోల్‌పై రూ.13, లీట‌ర్ డీజిల్‌పై రూ.16 ఎక్సైజ్ సుంకం పెంచింది.

దీంతో లీట‌ర్ పెట్రోల్‌పై మొత్తం ఎక్సైజ్ సుంకం రూ.32.90 పెరిగి ప్ర‌స్తుతం లీట‌ర్ పెట్రోల్ రూ.90.56కు చేరుకుంది. ఇందులో సుంకాల మొత్తం 36 శాతంగా ఉంది.

లీట‌ర్ డీజిల్‌పై మొత్తం ఎక్సైజ్ సుంకం రూ.31.80 (39 శాతం) పెరిగి ప్ర‌స్తుతం లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.80.87కి చేరింది. వీటికి తోడు రాష్ట్రాలు వ్యాట్ విధించ‌డంతో వీటి ధ‌ర‌లు భ‌గ్గుమ‌నే స్థాయికి పెరిగిపోయాయి. రాజ‌స్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీట‌ర్ ధ‌ర రూ.100 మార్క్‌ను దాటేసింది.