బీజేపీని భయపెట్టాలని చూస్తే ఖబర్దార్

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన గిరిజన రైతులు తమకు కేటాయించిన స్థలాలను అడిగితే.. సీఎం కేసీఆర్‌ వారిని 60 రోజులు జైలులో ఉంచారని మండిపడ్డారు. బీజేపీని భయపెట్టాలని చూస్తే ఖబర్దార్‌ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  హెచ్చరించారు. 

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా  నల్లగొండ జిల్లా పెద్దవూరలో నిర్వహించిన రోడ్‌ షోలో సంజయ్‌ మాట్లాడుతూ బీజేపీ నేతలు బయటకు వస్తే టీఆర్‌ఎస్‌ నేతలు ఒక్కరు కూడా బయటకు రారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్రంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికల పనులు జరుగుతున్నాయని చెప్పారు.అభివృద్ధి పనులపై వరంగల్‌ కాదు రాష్ట్రంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని.. దమ్ముంటే రావాలని సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు

 కరోనా సమయంలో సాగర్‌ నియోజకవర్గ బత్తాయి రైతు ఇబ్బందులు పడుతుంటే ఫాంహౌస్‌ నుంచి బయటకు రాని కేసీఆర్‌, మంత్రులు.. ఎన్నికలు రాగానే సిగ్గు లేకుండా వచ్చారని మండిపడ్డారు. 

కరోనా వ్యాప్తి ఉన్నా ఈ ప్రాంత రైతాంగం కోసం వస్తే.. తనపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం యత్నించిందని చెప్పారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని ఎత్తిపోతల పథకాల పేరిట డబ్బును జేబుల్లో ఎత్తిపోయడానికి సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు వేశారని విమర్శించారు.

 శ్రీశైలం సొరంగం పనులను కుర్చీ వేసుకుని కూర్చుని పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్‌కు ఇంకా కుర్చీ దొరకలేదేమోనని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని అన్నారు.

 ఇక్కడ సాగర సమరం జరుగుతుందని భావించిన తనకు కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌సలు కలిసి సాగర సంగమం సినిమా చూపిస్తున్నాయని అన్నారు. నాగార్జునుడు నడయాడిన పవిత్రమైన నేలను డబ్బుల కంటైనర్లు, మద్యం లారీలతో అపవిత్రం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

40 ఏళ్లుగా సాగర్‌ నియోజకవర్గంలో జానారెడ్డి చేసిందేమీ లేదని, వయసు పైబడిన పెద్దాయనకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన రవినాయక్‌ ప్రజాసేవకు ముందుకు వచ్చారని, ప్రజలు ఆశీర్వదించాలని సంజయ్‌ కోరారు.