రూ 4 లక్షల కోట్ల అప్పుల్లో ఏపీ ప్రభుత్వం 

 ఆంధ్రప్రదేశ్‌ రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ల్యాండ్‌, శాండ్‌, మద్యం బ్రాండ్‌, రోడ్ల పనులు.. ఇలా అంతటా అవినీతిమయంగా ఉందని ఆరోపించారు. 

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఏఎల్‌సీఎం క్రీడా ప్రాంగణంలో సోమవారం జరిగిన బీజేపీ-జనసేన మహాసభలో నడ్డా మాట్లాడారు. ఆయన ఆంగ్ల ప్రసంగాన్ని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలుగులోకి అనువదించారు. 

‘ఆం ధ్ర రాష్ట్రం అభివృద్ధి, పురోగతి లేకుండా 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఉంది. ఆర్థిక ఎదుగుదల లేకుండా అప్పులతో ప్రజలకు అభివృద్ధి ఉండదు. సామాన్యులకు ఇసుక అందుబాటులో లేదు’ అంటూ ఆయన మండిపడ్డారు. 

నిర్మాణ సంబంధిత కార్మికులు, వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. వైసీపీ నేతలు తక్కువ ధరకు భూములు కొని ఎక్కువ ధరకు ప్రభుత్వంతో కొనుగోలు చేయిస్తూ ఇంటి స్థలాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. .

ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలకు రూ.5.56 లక్షల కోట్లు అందజేసింది. 20 లక్షల గృహాలు, 4 నగరాలకు స్మార్ట్‌ సిటీ, ప్రధాన మంత్రి ఆవాజ్‌యోజన పథకాలకు 30 వేల కోట్లు ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో పదేళ్లలో ఏర్పాటు చేస్తామన్న అత్యున్నత విద్యా సంస్థలను రెండేళ్లలోనే ఏర్పాటు చేశాం అని నడ్డా వెల్లడించారు. 

అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, తిరుపతిలో ఐఐటీ, మంగళగిరిలో ఎయిమ్స్‌, పశ్చిమ గోదావరిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) వంటివి ఇందులో ఉన్నాయి. 

పుణ్యక్షేత్రమైన తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి రత్నప్రభను భారీ మెజారిటీతో గెలిపించండి’ అని నడ్డా కోరారు. తమిళనాడు, అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో తమదే విజయమని నడ్డా భరోసా వ్యక్తం చేశారు.