ఒడిశా చరిత్ర దేశ ప్రజలందరికీ చేరువ కావాలి 

సమగ్ర, వైవిద్ధ్యభరితమైన ఒడిశా చరిత్ర దేశ ప్రజలందరికీ చేరువ కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ‘ఉత్కళ్ కేసరి’ హరే కృష్ణ మహతాబ్ రాసిన ‘ఒడిశా ఇతిహాస్’కి హిందీ అనువాదాన్ని శుక్రవారం ఆవిష్కరించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, హరేకృష్ణ మహతాబ్ స్వాతంత్ర్యం కోసం, అదేవిధంగా సమాజం కోసం పోరాడారని చెప్పారు.

ఏడాదిన్నర క్రితం హరే కృష్ణ మహతాబ్ 120వ జయంత్యుత్సవాలను జరుపుకున్నామని మోదీ గుర్తు చేశారు. నేడు ఆయన రాసిన సుప్రసిద్ధ పుస్తకం ‘ఒడిశా ఇతిహాస్’కి  హిందీ అనువాదాన్ని ఆవిష్కరించుకున్నామని చెప్పారు. ఆయన స్వాతంత్య్ర పోరాటం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. 

స్వాతంత్య్రం కోసం పోరాడుతూ జైలు శిక్షను కూడా అనుభవించారని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మన సమాజం కోసం కూడా ఆయన పోరాడారని, ఇది చాలా ముఖ్యమైన విషయమని తెలిపారు. హరే కృష్ణ మహతాబ్ స్వాతంత్య్రం కోసం ఓ పార్టీలో ఉంటూ పోరాడారని, వేరొక పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. ఒడిశాలో మ్యూజియంలు, ఆర్కైవ్స్, ఆర్కియాలజీ సెక్షన్ వంటివన్నీ ఉన్నాయని, వీటన్నిటికీ కారణం ఆయన దార్శనికత, కృషి అని ప్రధాని వివరించారు. 

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేడీ ఎంపీ, హరే కృష్ణ మహతాబ్ కుమారుడు భర్తృహరి మహతాబ్ పాల్గొన్నారు. ‘ఒడిశా ఇతిహాస్’ పుస్తకం ఒడియా, ఇంగ్లిష్‌లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు హిందీలో కూడా లభిస్తోంది. దీనిని శంకర్ లాల్ పురోహిత్ హిందీలోకి అనువదించారు. 

భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో హరే కృష్ణ మహతాబ్ వీరోచితంగా పోరాడారు. ఆయన 1946-1950 మధ్య కాలంలో, 1956-1961 మధ్య కాలంలో ఒడిశా ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయన 1942-45 మధ్య కాలంలో రెండేళ్ళకు పైగా అహ్మద్ నగర్ ఫోర్ట్ జైలులో జైలు జీవితం గడిపారు. జైలులోనే ఆయన ‘ఒడిశా ఇతిహాస్’ పుస్తకాన్ని రాశారు.