మల్లారెడ్డి వీడియో లీక్ తో ఇరకాటంలో కేసీఆర్ 

‘‘సర్పంచ్ కిస్తే సరిపోతదా..ఈడ ఎమ్మెల్యే, మంత్రి ఉన్నడు..పొట్టుపొట్టు చేసి ఇడ్సిపెడ్తం’’ అని మంత్రి సిహెచ్ మల్లారెడ్డి మాట్లాడినట్టు ఓ ఆడియోలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇరకాటంలో పడినట్లు కనిపిస్తున్నది. ఆ మంత్రిని మంత్రివర్గం నుండి తొలగించాలని ఒకవైపు వస్తున్న వత్తిడులు, మంత్రిని వెనుకేసుకు వస్తే తన లొసుగులు కూడా ఎక్కడ బైటకు వస్తాయో అన్న భయం, తొలగిస్తే ఇతరత్రా వచ్చే సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తున్నది.  

తాను ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారితో మాట్లాడలేదని, ఆ వాయిస్  తనది కాదని చెబుతున్న మంత్రి  ఈ వ్యవహారంపై  సీఎం కేసీఆర్ ను కలిసి సంజాయిషీ ఇచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రగతి భవన్, ఫార్మ్ హౌస్ …. కేసీఆర్ ఎక్కడకు వెడితే అక్కడకు వెడుతున్నా మంత్రికి కలవడం కుదరడం లేదు. కేసీఆర్ మొఖం చాటేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. 

కాగా, మంత్రి మల్లారెడ్డికి ఇటువంటి వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. కేసీఆర్ సహితం ఏమీ పట్టించుకోవడం లేదు. మునిసిపల్ ఎన్నికల టైంలో ఆయన టికెట్లు అమ్ముకున్నట్టు బాధితులు నేరుగా టీఆర్ఎస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి విద్యాసంస్థలకు పక్కనే ఉన్న తన భూమిని కబ్జా చేశారని ఓ మహిళ హైకోర్టుకు వెళ్లింది. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించి మంత్రిపై కేసు పెట్టాలని పోలీసులను ఆదేశించింది. 

జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో మంత్రి అనుచరులు ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని కమిషనర్ మంగమ్మ అడ్డుకోబోగా మంత్రి సీరియస్ గా ఆమెకు వార్నింగ్  ఇచ్చినట్లు, దీంతో ఆమె తన డిప్యూటేషన్ ను రద్దు చేసుకుని సెక్రటేరియట్ విధుల్లో జాయిన్ అయినట్లు ప్రచారంలో ఉంది. రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కడంపై మల్లారెడ్డి తన సన్నిహితుల వద్ద చేసే కామెంట్స్ కూడా ప్రగతిభవన్ వర్గాలకు చేరినట్టు తెలిసింది.

‘‘నాకు పోస్టు ఊరికే రాలే..ముట్టజెప్తేనే  వచ్చింది’’ అని  ఆయన తరుచూ  మాట్లాడుతున్నట్టు నిఘా వర్గాలు రిపోర్టు ఇచ్చినట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం మల్లారెడ్డికి కొత్తేమీ కాదని, అయితే ఈసారి మాత్రం పార్టీ పెద్దలకు సన్నిహితంగా ఉండే రియల్టర్ ను  బెదిరించడం వివాదాస్పదమైందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకనే కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు.

భూ ఆక్రమణలు, బెదిరింపులకు పాల్పడుతున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి, అరెస్ట్ చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రైవేట్ వ్యక్తుల భూములపై మల్లారెడ్డి వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.

మల్లారెడ్డిపై ఫిర్యాదులు వస్తున్నా సీఎం ఎందుకు స్పందించడంలేదని ఆ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఎర్ర సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దూలపల్లి నుంచి శామీర్పేట వరకు ప్రతి వెంచర్ లో మల్లారెడ్డి వాటా డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.