మావోయిజం ప్రోత్సహించే ఆచార్య, విరాటపర్వం సినిమాలు

చిరంజీవి, రామ్‌ చరణ్‌, రాణా దగ్గపాటి నటిస్తున్న ఆచార్య, విరాటపర్వం సినిమా ద్వారా మావోయిస్టులను నక్సలైట్లను హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఉగ్రవాద వ్యతిరేక వేదిక (యాంటీ టెర్రరిజం ఫోరమ్) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు సినిమాలు యువతపై దుష్ప్రభావం చూపించే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.

మావోయిజం, నక్సలిజం భావజాలాలను ప్రశంసించే, ప్రోత్సహించే సినిమాలకు ధృవీకరణ పత్రం ఇవ్వవద్దని హైదరాబాద్ లోని బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్ ప్రాంతీయ అధికారిని డిమాండ్ చేసింది. వేదిక చైర్మన్ రావినూతల శశిధర్ ఆధ్వర్యంలో అధికారిని కలసి ఈ రెండు సినిమాలకు సంభందించి పూర్తి కథను, కథ సారాంశాన్ని, సినిమాను క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు.

వీటితో పాటు భవిష్యత్తులో ఏ సినిమాలోనైనా దేశ సమగ్రతకు భగం కలిగించే విధంగా నక్సలైట్స్‌ ని హీరోగా చూపించే విధంగా ఉంటే వాటికి అనుమతు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. లేని పక్షంలో ధియేటర్ల వద్ద ఆయా సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఇటీవల ఛత్తీస్‌గడ్‌లోని మావోయిస్టు బృందం ఇటీవల సిఆర్‌పిఎఫ్‌ సిబ్బందిపై దారుణమైన దాడి చేసిందని వారు గుర్తు చేశారు. ఈ దాడి ఫలితంగా 22 మంది జవాన్లు, అమరులయ్యారని పేర్కొంటూ ఈ సంఘటన 76 మంది సిబ్బందిని బలిగొన్న, మరి అనేక ఇతర సంఘటనకు దారితీసిన దంతేవాడ ఆకస్మిక దాడిని తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మావోయిజం, నక్సలిజం భావజాలాలను ప్రశంసించే, ప్రోత్సహించే ప్రచార సినిమాలను నిర్మించే మేధావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సల్స్‌, మావోయిజం భారతదేశంలో ప్రభుత్వం నిషేధించిన సంస్థలైనప్పటికీ వారి భావజాలాన్ని అనేక సినిమా ద్వారా యువతపై రుద్దుతున్నారని వారు తెలిపారు.

దీనిని సామాజిక ఆర్థిక సమస్యగా చిత్రీకరిస్తూ సిబిఎఫ్‌సీ నుండి ధృవీకరణ పత్రాన్ని జారీ పొందుతున్నాయని విస్మయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతలో ప్రజa సానుభూతి కోసం కొన్ని స్వార్థ శక్తులు మరియు అర్బన్‌ నక్సల్స్‌ సినిమాలను ఉపయోగించి వారి ఎజెండాను ముందుకు తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ఈ దాడుల నేపథ్యంలో బెదిరింపులపై సమాజం సమిష్టిగా పోరాడటం అత్యవసరం అని పేర్కొంటూ ఈ సామూహిక బాధ్యతలో భాగంగా, తమ సంస్థ తరపున, ఇటువంటి కథాంశాతో కూడిన సినిమాకు ధృవీకరణ పత్రం ఇవ్వవద్దని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. అంతర్గత భద్రత, దేశ సమగ్రత, అమరవీరుకు నివాళిగా, మావోయిజం, నక్సలిజం భావజాలంతో నిర్మించే సినిమాలపై సెన్సార్‌ బోర్డు నిషేధాన్ని విధించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కేశవ్‌సోని, శ్రీధర్‌రెడ్డి, విష్ణు వర్ధన్‌రెడ్డి కూడా ఉన్నారు.